రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాన్ని తూ.చ. తప్పకుండా పాటించారు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు. ఈమేరకు గురువారం లక్ష రూపాయల జరిమానాను ఆయన చెల్లించారు.
పట్టణ ప్రగతిలో భాగంగా ఈ నెల ఒకటో తేదీన కేటీఆర్ ఇల్లెందు పర్యటన సందర్భంగా స్థానిక మున్సిపల్ నూతన చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే సంకల్పంతో గల కేటీఆర్ కు ఫ్లెక్సీల ఏర్పాటు నచ్చలేదు. దీంతో పట్టణ ప్రగతి బహిరంగ సభా వేదిక మీద నుంచే మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుకు లక్ష రూపాయల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు.
ఆయా మొత్తాన్ని వసూలు చేయాలని అక్కడే ఉన్న కలెక్టర్ కు చెప్పారు. ఈమేరకు రూ. లక్ష జరిమానా చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ చైర్మెన్ దమ్మాలపాటికి గురువారం నోటీసు జారీ చేశారు. ఈ నోటీసు అందుకున్న చైర్మన్ వెంటనే లక్ష రూపాయల చెక్కును కమిషనర్ కు అందించారు.
కేటీఆర్ ఆదేశించారు. దమ్మాలపాటి పాటించారు. రూ. లక్ష ఫైన్ చెల్లించారు.
✍ తుమ్మలపల్లి ప్రసాద్