‘కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్…ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణా’… రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతల ఆకాంక్షకు సంబంధించిన వ్యాఖ్యలివి. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో కేటీఆర్ ఆదివారం పర్యటించిన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలివి.
కేటీఆర్ పర్యటన సందర్భంగా ఇల్లెందులో భారీ జనసమీకరణ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అనేక విశేషాలు చోటుచేసుకోవడం గమనార్హం. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ, ‘కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్’ అని వ్యాఖ్యానించారు. రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ కేటీఆర్ ను ఉద్దేశించి ‘ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణా’ అని సంబోధించారు.
సభా వేదిక మీద గల మరో ఇద్దరు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాసగౌడ్ లకు మాట్లాడే అవకాశం లభించలేదు. మానుకోట ఎంపీ కవిత, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ తమ ప్రసంగాల్లో పోడు భూముల ప్రస్తావన తీసుకురాగా సభికుల నుండి భారీ స్పందన వచ్చింది. అయితే మంత్రి కేటీఆర్ మాత్రం తన ప్రసంగంలో ఎక్కడా పోడు భూముల అంశాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. తన ప్రసంగం మొత్తంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను మాత్రమే కేటీఆర్ వివరించారు.
కాగా మంచి విద్యా వేత్తగా పేరుగాంచిన మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుకు సైతం సభలో ప్రసంగించే అవకాశం ఇవ్వకపోవడంపై కూడా స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
✍ తుమ్మలపల్లి ప్రసాద్