మంత్రి కొండా సురేఖ ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గీసుగొండ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తన అనుచరులకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ సీఐ సీట్లో కూర్చుని ఆమె భీష్మించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ వర్గీయుల మధ్య నెలకొన్న ఫ్లెక్సీ వార్ ఇందుకు దారి తీసింది. వివరాల్లోకి వెడితే..
దసరా పండుగ సందర్భంగా ధర్మారంలో మంత్రి కొండా సురేఖ వర్గీయులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే ఇందులో స్థానిక పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశరెడ్డి ఫొటో లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహించి ఫ్లెక్సీలను చించేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి వర్గీయులపై దాడి జరగ్గా, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కొండా సురేఖ వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ పరిణామాల్లో తమవారిని విడుదల చేయాలంటూ కొండా సురేఖ వర్గీయులు ఆందోళన చేపట్టారు. వరంగల్ – నర్సంపేట మెయిన్ రోడ్డులోని ధర్మారంలో ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారనేది కొండా సురేఖ వర్గీయుల ఆరోపణ.
ఇందుకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ హుటాహుటిన గీసుగొండ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. సీఐ సీట్లో కూర్చుని తమ వర్గీయులపై పెట్టిన కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమ కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ మంత్రి సురేఖ పోలీసు అధికారులను హెచ్చరించారు. కొండా సురేఖ పోలీస్ స్టేషన్ లో భీష్మించిన వీడియోను దిగువన చూసేయండి..