వీడియో చూశారు కదా? మంత్రి గంగుల కమలాకర్ ఏమంటున్నారు? డెబ్బయి సంవత్సరాలపాటు రాజ్యమేలినవారు ఏమీ చేయలేదని, ఆరు సంవత్సరాలకే కరెంటు వచ్చిందని, నీళ్లు వచ్చాయని, లోయర్ మానేర్ డ్యామ్ (ఎల్ఎండి) నిండి ఉన్నదని అంటున్నారు. ఎండాకాలం కూడా టాంక్ నిండుగా ఉందని, నీళ్లకు కొదువ లేదని పేర్కొన్నారు. నీళ్లు వస్తున్నాయని, కరెంటు వస్తోందని కడుపులో మంట మళ్లీ మొదలైందని చెబుతున్నారు. కడుపుల మంట ఎవరికి మొదలైందని ప్రశ్నిస్తూనే, జగనన్న బాణమట… షర్మిలక్క… ఎందుకొస్తున్నది షర్మిలక్క? ఇక్కడ బ్రహ్మాండంగా నీళ్లు, కరెంటు ఉన్నాయని, మళ్లీ దోచుకోవడం మొదలు పెడదామని వస్తున్నది. జగన్న బాణం షర్మిలక్క వచ్చాక, మళ్లీ జగన్న వస్తడు. జగన్ వచ్చాక మళ్లీ చంద్రబాబు వస్తడు. వచ్చాక మన సంగతేంది మల్ల? కొట్లాట మొదలైతది. కరెంటు, నీళ్లు ఎత్తుకపోతరు. జగనన్న బాణం, జగనన్న, చంద్రబాబుల నుంచి కాపాడే ఏకైక రక్షకుడు కేసీఆర్ మాత్రమేనని, అందుకే టీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవలసిన అవసరముందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మంత్రి గంగుల కమలాకర్.
ఇప్పుడీ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. తెలంగాణాలో వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో మంత్రి గంగుల వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. షర్మిల పార్టీ వెనుక టీఆర్ఎస్ పార్టీ హస్తముందని, సీఎం కేసీఆర్ వదిలిన బాణమని వివిధ రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో గంగుల కమలాకర్ చేసిన ఆయా వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారి తీశాయి. షర్మిల పార్టీపై ఎవరూ స్పందించవద్దని ఈనెల 9వ తేదీన ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు జారీ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈమేరకు కేసీఆర్ గులాబీ నేతలను కట్టడి చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలు వచ్చిన కొద్ది సేపట్లోనే సోషల్ మీడియాలో షర్మిల పార్టీపై పెట్టిన పోస్టులను టీఆర్ఎస్ వారియర్లు తొలగించారు. గడచిన వారం రోజులుగా షర్మిల పార్టీపై టీఆర్ఎస్ నేతలెవరూ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. కానీ మంగళవారం మీడియాతో మాట్లాడిన కమలాకర్ షర్మిల పార్టీనేగాక, ఏపీ సీఎం జగన్ ను, టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారి తీశాయి. ఆంధ్రా పార్టీలు, ఆంధ్రా నేతలు నినాదం ప్రామాణికంగా టీఆర్ఎస్ మరోసారి రాజకీయ విమర్శలకు పదును పెడుతోందా? దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురైన వ్యతిరేకత మరింత పెరగకుండా, షర్మిల పార్టీ, ఆంధ్రా నేతల పెత్తనం అనే నినాదాలను మరోసారి ఎత్తుకోనుందా? తద్వారా పార్టీ ప్రాబల్యం పెంచుకునేందుకు కమలాకర్ వ్యాఖ్యలు ఓ సంకేతమా? అధిష్టానం ఆదేశాల మేరకే మంత్రి గంగుల తాజా వ్యాఖ్యలు చేశారా? అనే సంశయాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి.