ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఇది తాజా పరిణామం. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురైన ఈటెల రాజేందర్ ఇలాఖాగా భావిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పై అభిమానాన్ని చాటుతూ భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికార పార్టీ రాజకీయాల్లో ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్ మధ్య గల సంబంధాలను ఉప్పు, నిప్పుగా ఉండేవని టీఆర్ఎస్ శ్రేణులు అభివర్ణించిన దాఖలాలు అనేకం. ముఖ్యంగా ఈటెల రాజేందర్ మంత్రిగా ఉన్న సమయంలో ఈ ఇద్దరి మధ్య సత్సంబంధాలు అంతంత మాత్రంగానే చెబుతుంటారు. మంత్రిగా ఉన్నపుడు ఈటెల రాజేందర్ ‘అయితే హైదరాబాద్, లేదంటే హుజూరాబాద్’ తరహాలోనే పర్యటనలు సాగేవి. అదేవిధంగా గంగుల కమలాకర్ కూడా కరీంనగర్ లేదంటే హైదరాబాద్ కు మాత్రమే పరిమితమయ్యేవారని గులాబీ కేడర్ భావించిన సందర్భాలు అనేకం. ఈ పరిస్థితుల్లోనే ఈటెల హుజూరాబాద్, గంగుల కరీంనగర్ మంత్రులుగా ప్రాచుర్యం పొందారు.
అయితే ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో శనివారం గంగుల కమలాకర్ పై అభిమానాన్ని చాటుతూ పలువురు స్థానిక నేతలు ఆయనకు ఫ్లెక్సీలు కట్టారు. గంగుల కమలాకర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ హుజూరాబాద్, జమ్మికుంట తదితర పట్టణాల్లో భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం విశేషం. గతంలో ఇక్కడ గంగుల కమలాకర్ పేరు ఎత్తే పరిస్థితి ఉండేది కాదని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. దీంతో తాజా రాజకీయ పరిణామాల్లో ఆయనకు ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పడడం రాజకీయ చర్చనీయాంశంగా మారింది.