తన మెత్తం చరిత్రపైనా, ఆస్తులపైనా విచారణ చేసుకోవలసిందిగా తెలంగాణా ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరపవచ్చన్నారు. భూకబ్జా ఆరోపణలపై ఆయన శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. రాజేందర్ ఇంకా ఏమన్నారంటే….
‘‘ఈటెల రాజేందర్ నిప్పు. ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయండి ప్రభుత్వం నుంచి నేను ఏ రాయితీ తీసుకోలేదు. ఈటెల లొంగిపోడు. ప్రశ్నించే దగ్గర ఉన్నాను. ఆస్తుల కోసం లొంగిపోడు. ఆత్మగౌరవానికంటే ఈ పదవి గొప్పది కాదు. నిగ్గు తేల్చండి. ఆరుసార్లు ఉత్తగనే ఎమ్మెల్యేగా గెలుస్తానా? ప్రజల నోట్లో నాలుకలా ఉన్నా. కులం, మతం పేరు చెప్పలేదు. మానవత్వాన్ని పంచిన నేతను నేను. ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఈటెల రాజేందర్ అనేవాడు ఏమీ లేనప్పుడే కొట్లాడిండు. ఎకరం భూమి కబ్జాలో ఉన్నా షెడ్డు కూలగొట్టి తీసుకోండి. నయీం బెదిరింపులకే భయపడలేదు.
కట్టుకథలతో,ముందస్తు ప్రణాళికలో భాగంగా స్కెచ్ వేసుకుని నా వ్యక్తిత్వాన్ని అప్రతిష్టపాలు చేేసేందుకు, నాపై విషం చల్లే కార్యక్రమంలో భాగంగా వార్తా కథనాలు వస్తున్నాయి. ఇటువంటి ఘటనలు జరిగితే బాధితులు ఫిర్యాదు చేసుకోవాలి. లేదా ఛానల్ పరిశోధన చేసి ప్రసారం చేయాలి. అత్యంత దుర్మార్గం, నీతిమాలిన చర్య. అంతిమ విజయం ధర్మానిదే. చిల్లర, మల్లర ప్రచారాలను ప్రజలు నమ్మరు.
2016లో లేటెస్ట్ హేచరీ పెట్టాలని, నా కుమారుడితో జమున హేచరీస్ ను ప్రారంభించాం. అచ్చంపల్లి, హకీంపేట గ్రామాల్లో రోడ్డు సౌకర్యం కూడా ఉండదు. 40 ఎకరాల భూమిని ఒకేసారి ఖరీదు చేసి షెడ్లు నిర్మించాం. మరో ఏడు ఎకరాలు కొన్నాం. కెనరా బ్యాంకు ద్వారా రూ. 100 కోట్ల రుణం తీసుకుని విస్తరిస్తున్నాం. మరింత పెంచాలని భావిస్తే చుట్టుపక్కల అసైన్డ్ భూములు ఉన్నాయి. పెట్టుబడిదారులకు రాయితీలు ఇస్తున్నారని దరఖాస్తు చేశాం. టీఎస్ఐఐసీ ద్వారా భూముల సేకరణకు సీఎం పేషీలోని నర్సింగరావు అనే అధికారికి చెప్పాను. నా షెడ్ల చుట్టూ అసైన్డ్ భూములు ఉన్నాయి. తొండలు గుడ్లు పెట్టని భూములు. నరసింగరావుకు చెప్పాను. ప్రభుత్వం సేకరించి ఇస్తే లేటవుతుంది అన్నారు. ఇప్పటికీ 20-25 ఎకరాల భూములు రైతుల దగ్గరే ఉన్నాయి. మీడియా వెళ్లి విచారణ జరపొచ్చు. వాళ్లే మనస్ఫూర్తిగా భూములు ఇచ్చేందుకు వచ్చారు. నేను నిరాకరించాను. ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఎమ్మార్వో ఆఫీసులో రికార్డు ఉంది. 1986లో పౌల్ట్రీ ఫాం పెట్టాను. ఈ రంగంలో అత్యంత వేగంగా ఎదిగినవాన్ని నేను. 2004 వరకు 170-180 ఎకరాలకు ఎదిగినవాన్ని. 2004 అఫిడవిట్ లో నా ఆస్తులు ఉన్నాయి. నేను ఆత్మగౌరవాన్ని, శ్రమను, ధర్మాన్ని నమ్మకున్నాను. నేను ముదిరాజ్ బిడ్డను. భయపడే జాతి కాదు. వెయ్యి, రెండు వేలు అడుక్కున్నవాడు వేల కోట్లకు ఎలా ఎదిగారు?’’ అని రాజేందర్ ప్రశ్నించారు. మొత్తంగా తన ఆస్తులపై ఎటువంటి విచారణ అయినా చేసుకోవచ్చని ఆయన సవాల్ విసిరారు.