ప్రజల ఆస్తులపై హక్కులతోపాటు వాటికి భద్రత కల్పించడానికే రాష్ట్రంలోని ప్రతి కుటుంబ వివరాలు, నిర్మాణాలను నమోదు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వ్యవసాయ తరహాలోనే వ్యవసాయేతర ఆస్తులకు కూడా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకకు అనుగుణంగా రెవిన్యూ చట్టంలో భాగంగా, చరిత్రలో ఇదో మైలు రాయిగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. ఈ నెల 10వ తేదీలోగా ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని నిర్మాణాల నమోదు పకడ్బందీగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో నిర్మాణాల నమోదుపై అడిషనల్ కలెక్టర్లు, జెడ్పీ సీఇఓలు, డీపీవోలతో మంత్రి దయాకర్ రావు వీడియో కాన్ఫరెన్స్ ని హైదరాబాద్ లోని తన కార్యాలయం నుంచి గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ధరణి పోర్టల్ దసరా సందర్భంగా ప్రారంభవుతుందని సీఎం కేసీఆర్ చెప్పారని, ఆలోగానే ప్రతి గ్రామంలోని నిర్మాణాలు, కుటుంబాల వివరాలన్నీ తప్పులకు తావులేకుండా పకడ్బందీగా నమోదు చేయాలని చెప్పారు. ఇంటి యజమానుల నుండి ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ ఖచ్చితంగా తీసుకోవాలన్నారు. ఒకవేళ యజమాని గనుక చనిపోతే ఎలాంటి వివాదాలకు తావులేకుండా అతని వారసుల పేరుమీద మ్యూటేషన్ చేయాలన్నారు. వ్యవసాయ భూములలో నిర్మించిన అన్ని ఆస్తులను కూడా నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందు కోసం ఒక యాప్ ను కూడా అందుబాటులోకి తేవడం జరుగుతోందన్నారు.
అధికారులందరూ వారి పరిధిలోని ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సర్పంచులు, మండల పరిషత్తు అధ్యక్షులకు వేరే ఎన్ని పనులున్నప్పటికీ దీనిని మొదటి ప్రాధాన్యతగా తీసుకొని గ్రామాల్లో అన్ని ఆస్తుల వివరాలు నమోదు అయ్యేట్టు చూడాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి పలువురు అధికారులతోపాటు, సర్పంచ్ లతోనూ మాట్లాడారు. రికార్డుల నమోదులో స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ పనులు చేయాలని, ఏవైనా అనుమానాలుంటే, రాష్ట్ర స్థాయిలోని ఉన్నతాధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.