నిన్నటి ఈ వీడియో గురించి తెలిసిందే. ‘హాలియా మండలం అనుముల గ్రామంలో పెద్దలు జానారెడ్డిగారి ఇంట్లో… మిషన్ భగీరథ మంచినీరు నల్లాల ద్వారా వస్తున్న దృశ్యం’ అనే కాప్షన్ తో పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం విడుదల చేసిన వీడియో ఇది.
హాలియా సభలో ‘తొక్కి పడేస్తాం… జాగ్రత్త’ అంటూ కేసీఆర్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ‘పెద్దలు జానారెడ్డి’ తీవ్రంగా స్పందించారు. సీఎం కేసీఆర్ చెబుతున్నవన్నీ అబద్దాలే అంటూ కౌంటర్ విమర్శలు చేశారు. మీరు గొప్పగా చెప్పుకుంటున్న మిషన్ భగీరథ నీళ్లు నా ఊరికే వస్తలేవ్… తెలుసా? అని నిలదీశారు. టీఆర్ఎస్ నాయకులు పదే పదే ‘పెద్దలు’ అని గౌరవిస్తున్నా జానారెడ్డి మరీ ఇంతగా ఇజ్జత్ తీస్తూ విమర్శిస్తే కారు పార్టీ సార్లు ఊర్కుంటారేంటి? అందుకే హాలియా మండలం అనుముల గ్రామంలో జానారెడ్డి సాబ్ ఇంటిని వెతికి మరీ పట్టుకుని వీడియో తీశారు. ‘ఇగో సూడుండ్రి పెద్దలు జానారెడ్డి ఇంట్లోని నల్లాలో మిషన్ భగీరథ నీళ్లు ఎట్ల పోస్తున్నయో…?’ అంటూ మాంచి వీడియోను రిలీజ్ చేశారు.
హబ్బ… జానారెడ్డి సాబ్ భలే దొరికిండు… అనుకుని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా ఉప ఎన్నిక జరిగే నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని గులాబీ శ్రేణులన్నీ మహాసంబరపడి ఉంటాయి. ‘పెద్దలు జానారెడ్డి’ చెప్పేవే అబద్ధాలు… మా మంత్రి దయాకర్ రావు ఏకంగా వీడియోను బయటపెట్టి మరీ భలే కౌంటర్ చేశారని ‘కారు’ పార్టీ కార్యకర్తలు ఆనందించారు. కానీ ఆ అనందం ఎంతో సేపు నిలిచినట్లు లేదు. ఇంతకీ ఏం జరిగింది? ‘పెద్దలు జానారెడ్డి’ మళ్లీ ఏమంటున్నారు? అనుకుంటున్నారా…!
‘అసలు నాకు అనుముల గ్రామంలో ఇల్లే లేదు. ఒకప్పుడు ఉండేది. కానీ దాన్ని ఎప్పుడో అమ్మేశాను. హాలియాలో మాత్రం ఇల్లు ఉంది. అక్కడికి వెళ్లండి. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నయో లేదో చూసి మీ సీఎంకు చెప్పండి. టీఆర్ఎస్ కార్యకర్తలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులుగా మారి హాలియాకు వెళ్లి, అక్కడ గల నా ఇంట్లోనే కాదు, అన్ని ఇళ్లల్లో చూసి, వీడియోలు తీసి, ఆ క్లిప్పులు సీఎం కేసీఆర్ కు పంపండి’ అని చురకలు తగిలించారు. ‘పెద్దలు జానారెడ్డి’ మాట్లాడేది ఎవరికీ అర్థం కాదని అనేక సందర్భాల్లో చాలా మంది అంటుంటారు… కానీ ఈ సెటైర్ల రుచి చూశాక గులాబీ కార్యకర్తలు హాలియాలోని జానారెడ్డి ఇంటిని పట్టుకుని మళ్లీ వీడియో తీస్తారో లేదో… చూడాల్సిందే మరి!