ప్రింట్ మీడియా హవా మాత్రమే కొనసాగిన రోజుల్లో ఎవరైనా నాయకుడు ఏవేని వివాదస్పద వ్యాఖ్యలు చేసి, మరుసటి రోజు తన మాటలను వక్రీకరించారని చెబితే చెల్లుబాటు అయ్యిండొచ్చు! మీడియా వాళ్లు పనీ, పాటా లేక ఉద్ధేశపూర్వకంగానే వక్రీకరించి ఉండవచ్చని భావించవచ్చు. కానీ ఈరోజుల్లో.., అంటే పెరిగిన సాంకేతికత, ప్రతి మాట వీడియో రూపంలో రికార్డ్ అవుతున్న పరిస్థితుల్లో మాట్లాడిన మాట మార్చి, వక్రీకరణ అంటే చెల్లుతుందా? ఈ చిన్న లాజిక్ ను మన పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విస్మరించినట్లు కనిపిస్తోంది. నిన్న ఐనవోలు మల్లిఖార్జునస్వామి జాతర ఏర్పాట్లపై సమీక్షించిన సందర్భంగా మంత్రి దయాకర్ రావు ఏమన్నారో తెలుసా? మేడారం జాతరలో అధికారులు తాగి పడుకున్నారని, ఎవరిని మందలించినా ఊగుతూ కనిపించారని దయాకర్ రావు అన్నారు. మంత్రి చేసిన ఆయా వివాదాస్పద వ్యాఖ్యలు అధికారగణం ఆగ్రహానికి కారణమైనట్లు కనిపిస్తోంది. అందుకే దయాకర్ రావు తన మాట మార్చారు.

తాజాగా ఆయన ఏమంటున్నారంటే… అధికారులు, ఉద్యోగులంటే ఎంతో గౌర‌వమని, గిట్ట‌ని వాళ్ళు తన మాట‌ల‌ను వ‌క్రీక‌రించారని అంటున్నారు. ఐన‌వోలు జాత‌ర ఏర్పాట్ల స‌మీక్ష స‌మావేశాన్ని పుర‌స్క‌రించుకుని తాను మాట్లాడిన‌ట్లుగా కొన్ని ప‌త్రిక‌లు, మీడియా ఛాన‌ళ్ళు, సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వ్యాఖ్య‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. త‌న మాట‌ల‌ను కొంద‌రు గిట్ట‌ని వాళ్ళు వ‌క్రీక‌రించార‌ని, త‌న‌కు అధికారులు, ఉద్యోగులంటే ఎంతో గౌర‌వ‌మ‌ని అన్నారు. తాను అధికారుల‌ను దూషించిన‌ట్లుగా వ‌స్తున్న వార్త‌ల‌ను మంత్రి ఖండించారు. నలభై ఏళ్ళ‌ త‌న సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో ఏనాడూ అధికారులు, ఉద్యోగుల‌ను నిందించ‌లేద‌న్నారు. పైగా అధికారుల స‌హ‌కారంతో అనేక అభివృద్ధి ప‌నులు చేస్తూ ఓట‌మి ఎర‌గ‌కుండా ఎదిగాన‌న్నారు. గ‌తంలో మేడారం జాత‌ర‌ను దృష్టిలో పెట్టుకుని, అధికారులు జాగ్ర‌త్త‌గా, అప్ర‌మ‌త్తంగా ప‌ని చేయాల‌ని మాత్ర‌మే సూచించాన‌న్నారు.

ఇంతకీ మంత్రి దయాకర్ రావు ఐలోని మల్లన్న సన్నిధిలో అధికారుల గురించి నిన్న ఏమన్నారో దిగువన గల వీడియో లింక్ లో వీక్షించి, ఏది వక్రీకరణో, మరేది నిజమో మీరే గ్రహించవచ్చు.

Comments are closed.

Exit mobile version