ముఖ్యమంత్రి కేసీఆర్ పై కక్ష సాధింపు కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణా రైతుల ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కేంద్రం తన తప్పు తెలుసుకుని తెలంగాణ రైతన్న పండించిన యాసంగి పంటను కొనేవరకు ఈ ఉద్యమం ఆగదని అన్నారు.
తెలంగాణలో రైతు ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్ వద్ద చేపట్టిన నిరసన దీక్షలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదన్న విషయం గుర్తుంచుకోవాలని, రైతులను ఏడిపించి మీరు బాగుపడరని మంత్రి శపించారు.
మండుటెండలో మత్తడి తాకని చెరువులు తెలంగాణాలో నేడు పరవళ్ళు తొక్కుతున్నాయని అన్నారు. బీజేపి పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షభం, పవర్ హాలిడే లు ఉన్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అందిస్తూ పంటలు విస్తారంగా పండిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్ కేవలం మూడేళ్ళలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల ఎకరాలకు నీరు పారించి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.
ప్రతి గింజ కొంటామని చెప్పిన బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు ఏం మాట్లాడలేక మొహం చాటేశారని అన్నారు. ఇదే విషయమై ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలవడానికి వెళ్తే మంత్రులను హీనంగా చూస్తూ అవమానపరిచే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. పైగా తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటు చేయాలని ఉచిత సలహాలు ఇచ్చారన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్లే మంత్రులుగా ఉన్నా నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు ఈ ఉద్యమం కొనసాగించాలని రైతు బిడ్డగా కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు. బీజేపీ వ్యతిరేక దీక్ష మొదలైందని, ఓపిక ఉన్నంత వరకు, బీజేపీ కళ్ళు తెరిచే వరకు దీనిని కొనసాగిస్తామని, కేంద్రం దిగిరాకపోతే ఉద్యమం ఉదృతం అవుతుందని హెచ్చరించారు.