ఖమ్మం నగర పాలక సంస్థకు మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి కాబోయే మేయర్ ఎవరనే అంశంపై వివిధ వర్గాల్లో ఇప్పటి నుంచే భిన్నరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఈసారి ఖమ్మం నగర మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే ఇటువంటి అంచనాలను, ఊహాగానాలను పటాపంచలు చేస్తూ మంత్రి పువ్వాడ అజయ్ క్లారిటీ ఇచ్చారు.
ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజయ్ మాట్లాడుతూ, తమ కుటుంబ సభ్యులు మేయర్ పదవికి పోటీ చేసే అవకాశం ఖచ్చితంగా లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబంలో తనతోపాటు తన తండ్రి రాజకీయాల్లో ఉన్నామని, పిల్లలు చదువుకుంటున్నారని చెప్పారు. తన ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొనడమే తప్ప, తన వదినకుగాని, తన భార్యకుగాని పోటీ చేసే ఆలోచన లేదన్నారు. మేయర్ గా ఎవరుండాలనే అంశాన్ని పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి అజయ్ వివరించారు.