మినీ మేడారం జాతర తేదీలు ఖరారయ్యాయి. ఈమేరకు ఖరారు చేసిన తేదీల వివరాలను మేడారం సమ్మక్క-సారలమ్మ పూజారుల సంఘం అధికారులకు నివేదించింది. సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల పూజారుల సమక్షంలో ఈ తేదీలను ఖరారు చేశారు.
వచ్చే ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నాలుగు రోజులపాటు మినీ మేడారం జాతర జరగనుంది. ఆయా తేదీల్లో భక్తులు వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతూ పూజారుల సంఘం జాతర కార్యనిర్వహణాధికారికి శనివారం లేఖ రాసింది.
ప్రతి రెండేళ్లకోసారి మేడారం జాతరను నిర్వహిస్తుంటారు. ఇదే దశలో జాతర జరగని సంవత్సరంలో మినీ జాతరను నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగానే మినీ జాతర తేదీలను పూజారుల సంఘం ఖరారు చేసింది. కాగా ప్రస్తుతం మేడారంలో ప్రతిరోజూ మినీ మేడారం జాతరను తలపించే విధంగా భక్తులు నిత్యం అమ్మవార్లను దర్శించుకుంటుండడం విశేషం.