బీఆర్ఎస్ పార్టీ తీరుపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ జాతకాలు తమ వద్ద ఉన్నాయని, తాము నోరు విప్పి చెప్పడం మొదలుపెడితే బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం జత కట్టిందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారని, గత ఎన్నికల్లో తమ మద్ధతువల్లే జీహెచ్ఎంసీలో ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. మూసీ ప్రక్షాళన విషయంలో బీఆర్ఎస్ ప్రణిళికలు రూపొందించలేదా? అని ప్రశ్నించారు.
మూసీ ప్రణాళికను తాను వద్దని చెప్పానని, అప్పటి విషయాలన్నీ ఇప్పుడు బయటపెట్టాలా? అని అసుదుద్దీన్ బీఆర్ఎస్ నేతలను సూటిగా ప్రశ్నించారు. తాను నోరు తెరిచి అప్పటి అంశాలపై మాట్లాడితే బీఆర్ఎస్ నేతలు ఇబ్బంది పడతారని, తట్టుకోలేరని హెచ్చరించారు.
బీఆర్ఎస్ లీడర్లు అప్పట్లో అహంకారంతో ఉండేవారని, ఈ అహంకారం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ విధానాలు స్థిరంగా ఉండాలన్నారు. కాగా ఇండ్లు కదల్చకుండా మూసీని ప్రక్షాళన చేస్తే తాము స్వాగతిస్తామని ఆయన ప్రకటించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్నారు.