‘సార్ మీరు ఏదైనా చేయండి. కానీ ఎన్కౌంటర్ పేరుతో ఉదయం 5 గంటలకు చంపొద్దు. సాధ్యమైతే అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించండి, కానీ పొట్టల్లో బుల్లెట్లు దింపొద్దు సీపీ సాబ్. ఉగ్రవాదానికి మతం ఉండదు. నాథూరాం గాడ్సేను గుర్తుంచుకోండి’
చూశారు కదా పై ట్వీట్ లోని ఘాటు వ్యాఖ్యలు. ఇదిగో దిగువన గల మరో ట్వీట్ ను కూడా చదవండి.
‘సార్..మీరు ఎస్ సార్ అన్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఎంత మంది జిహాదీలు ఉన్నారో చెప్పి పుణ్యం కట్టుకోండి. వాళ్ల సంఖ్య చెప్పండి. లేదంటే మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి. మీరు కేవలం భక్తునికి (బహుషా బీజేపీ కార్యకర్తో, సానుభూతిపరుడో అయ్యుండొచ్చు) మాత్రమే జవాబు చెబుతారా? లేదంటే ఎంపీకి కూడా బదులిస్తారా?
ఇదీ హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ ను ప్రశ్నిస్తూ చేసిన ట్వీట్లు, రీ-ట్వీట్లు. ‘దిశ’ ఎన్కౌంటర్ నిందితుల ఎన్కౌంటర్ ఘటనలో దేశ ప్రజల నుంచి జేజేలు అందుకున్న సజ్జన్నార్ ను టార్గెట్ చేస్తూ అసదుద్దీన్ ట్వట్టర్ వేదికగా వేసిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఇంతకీ ఓవైసీ సజ్జన్నార్ విషయంలో ఆయా విధంగా ఎందుకు స్పందించారంటే…
‘జిహాదీలుగా మారాలనుకునే అనేకమంది హైదరాబాద్ సిటీలోని అమెరికన్ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పని చేస్తున్నారని, మరోవైపు అమెరికా ఆస్తులపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించిందని, ఈ పరిస్థితుల్లో నగరంలో ప్రశాంత వాతావరణం కోసం పోలీసులు ఏవేని బ్యాక్ గ్రౌండ్ తనిఖీలు చేస్తున్నారా? అని సురేష్ కొచ్చట్టిల్ అనే నెటిజన్ ట్విట్టర్ లో పోలీసు శాఖను ప్రశ్నించారు. ఇందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ స్పందించారు.
‘ఔను సర్..ఇటువంటి అంశాల్లో సమాచారం సేకరించేందుకు ఇంటలిజెన్స్ విభాగంలో మాకు ప్రత్యేక సిబ్బంది ఉంది. వాళ్లు 24X7 పని చేస్తుంటారు. అప్రమత్తం చేసినందుకు ధన్యవాదాలు. అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే మమ్మల్ని అప్ డేట్ చేయండి’ అని సజ్జన్నార్ కోరారు.
ఇదిగో ఇక్కడే అసద్ భాయ్ కి కోపం తెప్పించినట్లుంది. ఓ మతానికి చెందినవారిని టార్గెట్ చేస్తూ సురేష్ కొచ్చట్టీల్ అనే నెటిజన్ ట్వీట్ చేయడం, దానికి సీపీ సజ్జన్నార్ బదులివ్వడం ఎంఐఎం అధినేతకు నచ్చనట్లుందనే అభిప్రాయాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. అందువల్లే ఈ విషయంలో అసదుద్దీన్ జోక్యం చేసుకుని సజ్జన్నార్ ను టార్గెట్ చేసి ఉంటారని ఆయన ట్వీట్లను బట్టి అర్థమవుతోందని అంటున్నారు. అయితే మధ్యలో ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్ ఉదంతాన్ని అసదుద్దీన్ పరోక్షంగా ఎందుకు ప్రస్తావించారన్నదే ప్రశ్నార్థకంగా మారింది.