ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొద్ది సేపటి క్రితం స్వల్పంగా భూమి కంపించింది. ఇటు తెలంగాణా, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు ఏర్పడ్డాయి. భూకంప కేంద్రం నుంచి 225 కిలో మీట్ల దూరంలో స్వల్పంగా భూమి కంపించింది. రెండు నుంచి మూడు సెకన్ల పాటు భూమి ప్రకంపనలకు గురైంది. రిక్టర్ స్కేల్ పై ప్రకంపన తీవ్రతను 5.3గా సంబంధిత అధికారులు గుర్తించారు.
తెలంగాణాలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు ఏర్పడ్డాయి. ములుగు కేంద్రంలో ఈ ఉదయం 7.27 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. ఖమ్మం జిల్లా చింతకాని, నాగులవంచ, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల తదితర ప్రాంతాల్లో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. యాదాద్రి జిల్లాలో రెండు సెకన్ల పాటు భూప్రకంపన ఏర్పడింది. హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్, అబ్ధుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూప్రకంపనలు కలిగాయి.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, జగ్గయ్యపేట, ఉభయ గోదావరి జిల్లాలోనూ భూప్రకంపనలు స్వల్పంగా ఏర్పడ్డాయి. దీంతో పలు ప్రాంతాల్లో జనం భయాందోళనకు గురయ్యారు. నివాస ప్రాంతాల నుంచి పరుగులు తీశారు.