మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రం కథాపరంగా వివాదాలను ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కథకు సంబంధించి వాద, ప్రతివాదనలతో పలు వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ‘మోషన్ పోస్టర్’ మెగాస్టార్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని కలిగించింది. ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకునే రీతిలో ఆకట్టుకుంది కూడా. అయితే తమ కథను కాపీ చేసి కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా తీస్తున్నారనే అభియోగాలనూ ఆ చిత్ర నిర్మాణ సంస్థ తోసిపుచ్చింది. కొరటాల శివ ‘ఆచార్య’ కథను సొంతంగా తయారు చేసుకున్నారని చిత్రాన్ని నిర్మిస్తున్న మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ పేర్కొంది.
చిత్రంలో చిరంజీవి మధ్య వయస్కుడైన నక్సలైట్ గా కనిపిస్తారని, దేవాదాయ, ధర్మాదాయ శాఖలో జరిగే అవినీతిపై పోరాటం చేస్తారని, సినిమా కథనపు సారాంశంపై వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆచార్య’ కథ కాపీనా? కాదా? అనే ప్రశ్నలను కాసేపు వదిలేస్తే… ‘ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్’ను నిశితంగా పరిశీలించండి. ‘ధర్మస్థలి’ అనే పేరుతో ఓ ద్వారం లాంటి కట్టడం కనిపిస్తోంది కదా? ఆ కట్టడం ముందు ఆలీవ్ గ్రీన్ డ్రెస్ లో, ఎర్ర కండువాను ధరించిన చిరంజీవి కుడి చేతిలో ఓ కత్తి కనిపిస్తోంది చూశారుగా? చిరంజీవి అభిమానులను విపరీతంగా అలరించిన మోషన్ పోస్టర్ ఇది.
ఇదే దశలో ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు చిత్రాలను ఓసారి బేరీజు వేసి చూడండి. చిరంజీవి ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లో ‘ధర్మస్థలి’ పేరుతో కనిపిస్తున్న కట్టడం అచ్చం కరీంనగర్ ‘కమాన్’ను పోలి ఉంది కదా? ఒకప్పుడు కరీంనగర్ ఎంట్రన్స్ లో ఇది కనిపించేది. ప్రస్తుతం నగరం మధ్యలోకి వెళ్లింది. అంటే కరీం‘నగరం’ భారీగా విస్తరించిందన్నమాట.
కాగా మధ్య వయస్కుడి నక్సలైట్ పాత్రను చిరంజీవి ఈ చిత్రంలో పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే చిరంజీవి పాత్ర కరీంనగర్ కేంద్రంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ అవినీతిపై పోరాటం చేసిందా? అదే నిజమైతే ఆ నక్సలైట్ నాయకుడెవరు? ‘ఆచార్య’ అనే టైటిట్ ఏ ప్రముఖ నక్సల్ నేతను స్ఫురణకు తీసుకువస్తోంది? చిత్ర దర్శకుడు కొరటాల శివ చెప్పే ‘ఆచార్య’ సినిమా కథ ఆ ప్రముఖ నక్సల్ లీడర్ చుట్టే తిరుగుతుందా? వాస్తవిక పోరాటానికి సినిమా టిక్ కథనాన్ని కూడా అల్లుకున్నారా? ఇంతకీ చిరంజీవి పోషిస్తున్న ఆచార్య పాత్ర ఎవరిది?
(తరువాత కథనంలో….)