కాళేశ్వరం పండు మింగిండు…
జనాలకు తొక్క మిగిల్చిండు…!
ఇప్పుడు ఛలో మేడిగడ్డ అంటుండు…!!
************
హత్య చేసినోడికి చచ్చినోడి శవం ఎట్లుందో… అని మరుసటిరోజు చూసేదాకా నిద్రపట్టదట… అదే వాడిని పోలీసులకు పట్టిస్తదని చెబుతుంటరు…
ఇప్పుడు “మనోళ్ళ” పరిస్తితి అచ్చం అట్లనే ఉన్నది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును సర్వనాశనం చేసి, మేడిగడ్డ పర్యటన అంటూ బయలు దేరిన్రు…
జస్ట్ రెండు పిల్లర్లు పర్రెలిచ్చినయ్…దానికి ఇంత లొల్లి చేస్తుంరు…రిపైర్ చేయకుండా మొత్తం బ్యారేజీ కొట్టుకు పోయేలాగా కుట్ర చేస్తుంరు… అని మొత్తం సమస్యను చిన్నదిగా చేసే ప్రయత్నం…ప్రజలను పక్కదోవ పట్టించే ఎత్తుగడ…
********
నిజంగా సమస్య చిన్నదా…???
కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తాల్సిన మొత్తం 215 టిఎంసి నీటిలో 195 టిఎంసి లు ఎత్తాల్సింది మేడిగడ్డ నుండే…
మిగతా 20 టిఎంసి లు గత ప్రభుత్వాలు కట్టిన ఎల్లంపల్లి రిజర్వాయర్ నుండి…
డిపిఆర్ (DPR-Detailed Project Report) లో చెప్పిందిదే…
అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో రావాల్సిన మొత్తం నీటిలో 90 శాతం మేడిగడ్డ నుండే ఎత్తాలి…
మేడిగడ్డ పక్కనే కాళేశ్వరం గుడి ఉంటది…అందుకే మొత్తం ప్రాజెక్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు అని పేరు వచ్చింది…
ఇప్పుడు మేడిగడ్డ కుంగిందంటే మొత్తం కాళేశ్వరం కుంగినట్టే…
***********
ఈ పెద్దమనుషులు మేడిగడ్డను కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ అని మొన్నటిదాకా చెప్పింరు…
ఇప్పుడు మేడిగడ్డ కుంగడంతో మాట మారుస్తున్నరు…
కాళేశ్వరం అంటే “అదో పెద్ద వ్యవస్థ”… ఇన్ని పంపు హౌసులు… అన్ని బ్యారేజీలు…ఇన్ని కిలోమీటర్ల కాలువలు… అంటూ జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నరు…
*********
మొత్తం కాళేశ్వరం వ్యవస్థనే చెత్త కుప్పగా మారిందనే విషయం ప్రజలనుండి దాయాలని చూస్తున్నరు…
*********
మొదట మేడిగడ్డ సంగతి చూద్దాం…
*********
పిల్లర్లు కుంగగానే కాంట్రాక్టరే మొత్తం రిపైర్ చేస్తాడని వాడితో బలవంతంగా స్టేట్ మెంట్ ఇప్పిచ్చింరు… ఇది అబద్దమని “మనోల్లకు” ముందే తెలుసు…
ఎలక్షన్ కాగానే వాడు మాట మార్చిండు… ఇది ఈపిసి కాంట్రాక్టు కాదు… లంప్ సమ్ (Lumpsum) కాంట్రాక్టు… కాబట్టి మా బాధ్యత ఏం లేదు… మొత్తం ప్రభుత్వమే భరించాలి… అని వాడు బిగదీసుకొని కూర్చున్నడు…
“మనోళ్ళు” ఇప్పుడు మాట మార్చింరు… ఎన్ని వేలకోట్ల ఖర్చైనా ప్రభుత్వమే భరించాలి… మళ్ళీ కట్టాలి… అని ఇప్పుడు లొల్లి…
********
మేడిగడ్డ రిపైర్ ఎక్కడ మొదలు పెట్టాలో ఎవ్వడికీ తెలియట్లే…
ఇందులో కేవలం రెండు పిల్లర్లు కుంగినయని చెబుతున్నరు…
వాస్తవానికి ఈ రెండు పిల్లర్లతో పాటు మేడిగడ్డలో మొత్తం 85 పిల్లర్లు నిలబడిఉన్నది ఒకే శ్లాబు (Raft) పైన…
ఈ శ్లాబు మొత్తం ఒకేసారి ఒకే నిర్మాణంగా (Monolithic) వేశారు…శ్లాబు కుంగకుండా ఈ పిల్లర్లు కుంగవు…
శ్లాబు కుంగిందంటే మొత్తం పిల్లర్లకు ప్రమాదం ఉన్నట్టే…
కాన్సర్ శరీరం మొత్తం పాకిందా?… లేక ఒక పార్ట్ కే పరిమితమా…? ఇంకా తేలలే…! అప్పుడే పెషంటుకు కీమో తెరపీ మొదలు పెట్టమని గగ్గోలు పెడుతున్నారు…
పాత అలవాటు ఇంకా పోలే..
కాంట్రాక్టర్ కు పని ఇవ్వడం… కమిషన్ మెక్కడం… జనాలకు పనికొస్తదా…లేదా… అనే ప్రశ్నే లేదు…
***************
అసలు సమస్య 2019 లోనే మొదలైందనీ…ఎవ్వడూ పట్టించుకోకుండా గాలికొదిలేస్తే సమస్య ఇక్కడిదాకా వచ్చిందని అప్పట్లో ఇంజనీర్లు రాసిన లెటర్లు స్పష్టం చేస్తున్నాయి…విజిలెన్స్ రిపోర్టులో అప్పటి ఫోటోలు కూడా బయటకొచ్చినయ్… కాంట్రాక్టరుకు శాలువా కప్పి నెత్తికెక్కించుకుంటే వాడు ఇంజనీర్ల మాట ఎందుకు వింటడు… రిపైర్…గిపైర్ నై జాంతా … అని ఆ లెటర్లను చెత్తకుప్పలో పడేసిండు…
మూడేళ్లు నిద్ర పోయి, ప్రాజెక్టులు నిండా మునిగినంక… అధికారం కోల్పోతే కానీ సోయిరాలేదు…
ఇప్పుడు అంటిన బురదను ఎదుటోడికి పూసే ప్రయత్నం…
*********
మొత్తం బ్యారేజీకే ప్రమాదం ఉందని కేంద్ర నిపుణుల బృందం తేల్చింది…
మేడిగడ్డ ప్రమాదం ఆషామాషీ కాదు…ఇది ప్లానింగు…డిజైను…నిర్మాణము…నాణ్యతా…నిర్వహణ లోపాలన్నీ కలిసి ఈ ప్రమాదం జరిగిందని కేంద్ర నిపుణుల బృందం తేల్చింది…
పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తే గానీ రిపైర్ ఎలా చేయాలో తెలియదు…
ప్రమాదం కేవలం మేడిగడ్డకే కాదు… మేడిగడ్డలాగే డిజైన్ చేసి నిర్మాణం చేసిన అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకు కూడా ప్రమాదం ముంచి ఉన్నదని కేంద్ర బృందం తేల్చింది…
అంటే గోదావరిపై కాళేశ్వరంలో భాగంగా కొత్తగా కట్టిన అన్నిబ్యారేజీలకు ప్రమాదం తప్పదన్న మాట…
*********
అసలు కారణం తెలుసుకోకుండా హడావిడిగా రిపైర్ చేస్తే… మళ్ళీ వరదోచ్చి కొట్టుకు పోతే… “చూడండి.. వీళ్ళ పనితనం ఎలా ఉందో…” అని దెప్పిపొడవచ్చు…
పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ ఆలస్యమయి రిపైర్ చేయకుంటే… వరదలకు బ్యారేజీ పాడయితే… కావాలని మేడిగడ్డ ను ముంచింరు అని ప్రభుత్వాన్ని బదనామ్ చేయొచ్చు…
“మనోల్ల” తెలివి మామూలుగా లేదుగా…!
***********
జనాలకు తెలియని విషయం ఇంకోటుంది… మనోళ్ళు ఫిబ్రవరి 2023 లోనే అసలు లోపాలు ఎమున్నాయో అని సెంట్రల్ వాటర్ కమిషన్ కు (CWC) ఒక లెటర్ రాసింరు…
CWC లెటర్లో ఏమున్నదో తెలుస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి…
మొత్తం మేడిగడ్డకు సెలెక్ట్ చేసిన స్థలమే సరైంది కాదు… మెడకాయమీద తలకాయ ఉన్నోడు ఎవ్వడు కూడా అలాంటి ప్రదేశాలలో బ్యారేజీ కట్టరు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింరు…
అంతేనా… మొత్తం పంపు హౌసుల నిర్మాణం లోపభూయిస్టంగా జరిగిందనీ… వరదోచ్చినప్పుడల్లా అవి మునగడం ఖాయమనీ.. ఆ లెటర్లో రాసింరు…
“మనోళ్ళు” ఆ లెటర్ ను అత్యంత రహస్యంగా ఉంచింరు…
*************
ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీ రిపేరు చేస్తే, దాని పంపు హౌసు మునగదని గ్యారెంటీ లేదు…
ఈ రెండూ మునగ కుంటె…అన్నారం పంపు హౌసో… సుందిళ్ళ పంపు హౌసో మునగదని గ్యారెంటీ లేదు…
ఈ మూడు బ్యారేజీలలో ఏ ఒక్క దానికి సమస్యోచ్చినా… ఏ ఒక్క పంపు హౌసు మునిగినా మొత్తం కాలేశ్వరానికి మరో రెండేళ్ళు మంగళం పాడినట్టే…ఒక్క చుక్కా పైకెక్కదు…
ప్రాజెక్టు దండగ… కాంట్రాక్టర్లకు పండగ…
************
ప్రమాదం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకేనా….?
లక్షకోట్లు గుమ్మరించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ నాలుగేళ్లలో జరిగిన ప్రమాదాలు చూడండి…
1. మేడిగడ్డ పంప్ హౌజ్ మునిగింది…ఇప్పటికీ 11 పంపులు తుక్కుగానే ఉన్నాయి…
2. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ కాలువలు ఏటా కూలుతూనే ఉన్నాయ్…
3.అన్నారం పంప్ హౌజ్ మునిగింది…
4. సుందిళ్ళ బ్యారేజీ కట్టలు తెగినయ్…
5. మేడారం పంప్ హౌజులు క్రాకులిచ్చినయ్…
6. రామడుగు సొరంగాలు కూలినయ్…
7. మిడ్ మానేరు డ్యామ్ కుంగింది…
8. కొండపోచమ్మ రిజర్వాయర్ కు రంద్రాలు పడ్డయ్…
9. మల్లన్నసాగర్ కాలువకు బొక్కలు పడ్డయ్…పందికొక్కులు ఈ బొక్కలు పెట్టినయని సమర్దించుకున్నరు…
10. ఎక్కడికక్కడ పంపు హౌజులకు, సొరంగాలకు, కాలువలకు పెచ్చులూడు తున్నయ్…
11. ఇప్పుడు అసలైన మేడిగడ్డ బ్యారేజి కూడా కుంగింది…!
12. అన్నారం బ్యారేజీ కింద బుంగలొచ్చినయ్…!!
************
100 ఏళ్ళు ఉండాల్సిన ప్రాజెక్టుకు…4ఏళ్లకే వందేళ్లు నిండినయ్…ఖర్మ…!
ఇది కాళేశ్వరం కాదు…!నిజంగానే తెలంగాణ పాలిట శనీశ్వరం…!!
************
సమస్య ఒక్క మేడిగడ్డదే కాదు… మొత్తం కాలేశ్వరానిది… సమగ్ర విచారణ చేయించకుండా తొందర పడి రిపేర్లు చేస్తే వేల కోట్ల రూపాయల ప్రజాధనం మళ్ళీ వృధా అవుతుంది… బాగుపడేది మళ్ళీ “మనోళ్లే”…
వీళ్ళ డ్రామాలను ప్రభుత్వం పట్టించుకోకూడదు….
- తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీపీజేఏసి)