నెల కాగానే జీతం తీసుకుని, మెక్కుబడిగా ఉద్యోగం వెలగబెట్టే అనేక మంది ప్రభుత్వ ఉద్యోగుల గురించి వింటుంటాం… చదువుతుంటాం. కానీ ఈ ఘటనలో వైద్య సిబ్బంది అందుకు విరుద్ధం. వారి పనితీరుకు ఏ బిరుదు ఇచ్చినా తక్కువే. కష్టానికి ప్రతిగా మరే అవార్డు ప్రదానం చేసినా తక్కువే. ఎందుకంటే… ఓ ఆదివాసీ గిరిజన మహిళ పురిటినొప్పులతో ప్రసవ వేదన పడుతున్న వేళ, జోలీ కట్టి దాదాపు ఏడు కిలోమీటర్లు వైద్య సిబ్బంది ఆమెను మోసుకురావడమే అసలు విశేషం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం పూసుగూడెం పంచాయతీ పరిధిలోని సోయం గంగులు నగర్ కు చెందిన గర్భిణీ మడకం ధులే పురిటినొప్పులతో బాధపడుతోంది. గొత్తికోయలకు చెందిన ఈ గిరిజన పల్లె నుంచి ప్రధాన రహదారిని చేరుకోవడానికి ఎటువంటి రవాణా సదుపాయాలు కూడా లేవు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ పనిచేసే ఆశా వర్కర్ ధనలక్ష్మి, అంగన్వాడీ దుర్గ, ఏఎన్ఎం జ్యోతిలు కలిసి ఓ జోలీ కట్టారు. గర్భిణీ మడకం ధులేను జోలీలో కూర్చోబెట్టి సుమారు ఏడు కిలోమీటర్ల వరకు అటవీ మార్గంలో మోసుకుంటూ వచ్చారు. అయితే ఇంతలోనే, మార్గమధ్యంలోనే ధులేకు పురిటినొప్పులు తీవ్రం కావడంతో జోలీ మోసిన వైద్య సిబ్బంది అడవుల్లోనే ఆమెకు కాన్పు చేశారు. ధులే తన ఆరవ సంతానంగా మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం మెరుగైన చికిత్స కోసం తల్లీ, బిడ్డలను మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.