మేడారం జాతరలో బస చేసేందుకు వసతులు ఏముంటాయ్… సాధారణ భక్తులకైతే ఆకాశమే కప్పు, అడవి తల్లే ఒడి. ఎన్నో ఏళ్లుగా భక్తులు సేద తీరుతున్న దృశ్యం ఇదే. కొందరు ఎడ్ల బండ్లను, మరికొందరు ట్రాక్టర్లను, ఇతర వాహనాలను కూడా జాతరలో తమ తాత్కాలిక ఆవాసాలుగా మార్చుకుంటారు. ఇంకొందరు చెట్ల కింద సేద తీరుతుంటారు. కోటిన్నర మంది భక్తులు హాజరయ్యే సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడం సర్కారుకు ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. నిత్యం భక్తులతో విలసిల్లే పుణ్య క్షేత్రాల్లోనే ఒక్కోసారి వసతి కష్టమవుతుంటుంది. ఇక మూడు రోజుల్లో ముగిసే మేడారం జాతరలో మాత్రం ఏం వసతులు ఉంటాయ్… అని నిట్టూర్చకండి.
ఇదిగో ఇటువంటి అందమైన గుడారాలు కూడా ఈసారి జాతరలో ఉన్నాయ్ మరి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అధునాతన వసతులతో ప్రత్యేక గుడారాలు నిర్మించారు. మేడారం జాతరలోని హరిత హోటల్ ప్రాంతంలో వీవీఐపీల కోసం 40 గుడారాలు, 20 డీలక్స్ గదులు ఏర్పాటు చేశారు. ఇందులో పది ఏసీ డీలక్స్ రూమ్ లు కూడా ఉన్నాయి. సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో మ్యూజియం సమీపాన 40 గుడారాలు ఏర్పాటు చేశారు. కోటిన్నర మంది భక్తుల్లో ఇవి ఎవరికి కేటాయిస్తారు? ఏ మూలకు సరిపోతాయ్…? అని మాత్రం ప్రశ్నించకండి. జాతరలో ఈ ‘గుడారం’ వసతి ఓ ప్రత్యేక ఆకర్షణ మాత్రమే. వీవీఐపీలకు మాత్రం తప్పకుండా లభిస్తాయ్. ఈ డీలక్స్ గదుల, గుడారాల సొగసు ఏమిటో దిగువన స్లైడ్ షోలో తిలకించండి. సీ అండ్ ఎంజాయ్… డోన్ట్ ఆస్క్.. టెంట్… ఓకే!