ఒక్కోసారి పొరపాట్లు జరుగుతుంటాయ్… సమాచార లోపమో, సంబంధిత రిపోర్టర్ అవగాహనారాహిత్యమో, డెస్క్ సిబ్బందికీ తెలియకపోవడమో తదితర అంశాల కారణంగా వార్తా ప్రచురణలో ఏదేని పొరపాటు జరగవచ్చు. అప్పుడప్పుడూ జరుగుతుంటాయ్ కూడా. తప్పును తప్పుగా అంగీకరించి లెంపలేసుకుని, సమాచార లోపం కారణంగా జరిగిన పొరపాటుకు ‘విచారం’ వ్యక్తం చేస్తున్నాం అని వివరణ ఇచ్చుకున్న సంఘటనలు కూడా ప్రపంచ పత్రికా వ్యవస్థలో అనేకం ఉన్నాయి. జర్నలిస్టులేమీ దేవుళ్లు కాదు…వారికి దివ్య దృష్టి ఉండదు. చూసిన దృశ్యాన్ని, తెలుసుకున్న విషయాన్ని పాఠకులకు అందించడమే పత్రికల, ప్రసార మాధ్యమాల లక్ష్యం. ఇందులో ఎటువంటి సందేహం ఉండకపోవచ్చు.
కానీ తమ పాఠకులను తక్కువగా అంచనా వేసి, తాము ఏది రాసినా నమ్ముతారని భ్రమించడమే అవివేకమవుతుంది. పొరపాటును సమర్థించుకునే వ్యర్థ ప్రయత్నమవుతుంది. ఇందుకు గురువారం సాక్షి ప్రచురించిన మరో వార్తా కథనమే నిదర్శనం. నిన్ననే చెప్పుకున్నాం కదా? మేడారం చరిత్రలోనే, జాతర ఆనవాయితీలోనే లేని సమ్మక్క పెళ్లి గురించి ‘సాక్షి’ పత్రిక వండి వార్చిన రెండు వార్తా కథనాల గురించి. ఇప్పటి వరకు ఏ పత్రికా, ఏ జర్నలిస్టూ రాయని ఎక్స్ క్లూజివ్ అంశాన్ని కనిపెట్టినట్లు నిన్నటి మెయిన్ ఎడిషన్లో సమ్మక్క పెళ్లి అంటూ.. రెండు వార్తా కథనాలను ఒకే పేజీలో ప్రచురించిన సంగతి తెలిసిందే.
సరే.. ఒక్కోసారి మనకు తెలిసింది కూడా నిజం కాకపోవచ్చు. సాక్షి రాసింది కదా? సమ్మక్క పెళ్లి జరిగే ఉంటుంది.. అని భావించి ఉదయాన్నే ‘సాక్షి’ పత్రిక మెయిన్ ఎడిషన్, జాతర జరుగుతున్న ములుగు జిల్లా టాబ్లాయిడ్ ను అక్షరం అక్షరం పరిశీలించగా మరో అద్భుత కథనం సాక్షాత్కరించింది. అదేమిటంటే ‘ఆదివాసీ పద్ధతిలో సమ్మక్క పెళ్లి’ అనే శీర్షికతో మెయిన్ ఎడిషన్ 5వ పేజీలోనే మరో వార్త కనిపించింది. రెండేళ్లకోసారి కల్యాణ తంతు ఉంటుందని, బుధవారం ఆదివాసీ సంప్రదాయ ప్రకారం పెళ్లి జరిగిందన్నది ఆయా వార్తా కథనపు సారాంశం. సరే ఎవరి సంప్రదాయ పద్ధతుల్లోనే వారి వారి పెళ్లిళ్లు జరుగుతుంటాయ్. సాక్షి కథనం ప్రకారం… సమ్మక్క ఆదివాసీ వీరవనిత కాబట్టి వాళ్ల సంప్రదాయంలోనే పెళ్లి జరిగి ఉంటుంది. ఇందులో కొత్తగా చెప్పే సంప్రదాయం కూడా ఉండకపోవచ్చు. కానీ…?
కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన మేడారం సమ్మక్క పెళ్లి గురించి ‘సాక్షి’ వంటి ప్రముఖ పత్రిక మెయిన్ ఎడిషన్లో వార్త ప్రచురించాక, పెళ్లికి సంబంధించిన ఫొటో ఉండకపోతుందా? యాభై ఏళ్లుగా జాతర చూసిన కళ్లతో ఎప్పుడూ పెళ్లి చూడకపోయినా, కనీసం ఫొటో చూసి దండం పెట్టుకుందామని సాక్షి పత్రికను ఎన్నిసార్లు తిరగేసినా ఫలితం లేకపోయింది. పధ్నాలుగు పేజీల మెయిన్ ఎడిషన్లో ప్రచురించిన 13 ఫొటోల్లో, మరో 14 పేజీల ములుగు జిల్లా అనుబంధంలో వాడిన దాదాపు 75 ఫొటొల్లో ఎక్కడా సమ్మక్క పెళ్లి ఫొటో సాక్షాత్కరించలేదు.
వాస్తవానికి ఎన్నడూ లేని విధంగా దేవుళ్ల రాకలో ఈసారి అత్యంత ఆలస్యం చోటు చేసుకుంది. పగిడిద్దరాజు సహా సారలమ్మ సైతం బుధవారం అర్థరాత్రి దాటాకే.. అంటే తేదీ మారిన గురువారమే గద్దెలను అధిష్టించారు. కానీ బుధవారం పగిడిద్దరాజు-సమ్మక్క కల్యాణం తంతు జరిగినట్లు కూడా సాక్షి తన వార్తా కథనంలో మరోసారి వండి ‘వడ్డించడం’ అసలు విశేషం. అందువల్ల ‘సమ్మక్క’ పెళ్లి జరిగిందని తొలిసారిగా నమ్మండి. ఎందుకంటే సాక్షి వార్త రాసింది కాబట్టి. ఫొటో గురించి మాత్రం అడక్కండి. మేడారం జాతర వార్తల కవరేజి కోసం భారీగా మోహరించిన సదరు పత్రికకు చెందిన విలేకరులు, ఫొటోగ్రాఫర్ల యంత్రాంగం సమ్మక్క పెళ్లి ఫొటోలు తీయడం మర్చిపోయి ఉండొచ్చు. ఒక వేళ వాళ్లు తీసి పంపినా డెస్క్ లో సబ్ ఎడిటర్ దాన్ని ప్రచురించడం మర్చిపోయి ఉండవచ్చు. ఎప్పుడూ జరగని సమ్మక్క పెళ్లి గురించి ఫొటో వస్తే మాత్రం, ఖచ్చితంగా ప్రచురించి తన పాఠకులకు విశేషంగా చూపాలా? అని సందేహించి ఉండవచ్చు. ఓ పాఠకునిగా డబ్బు పెట్టి పత్రికను కొన్నందుకు ప్రశ్నించే హక్కు ఉందంటారా? ప్రశ్నించొద్దు… రాసింది చదువుకోవాలి… అంతే!