మేడారం మహాజాతరకు అంకురార్పణగా బుధవారం పూజలు ప్రారంభమవుతున్నాయి. ‘మండ మెలిగే’ పండుగగా వ్యవహరించే ఈ పూజలతో వనదేవతల మహాజాతర ప్రారంభమైనట్లుగానే పూజారులు భావిస్తారు. జాతరకు సరిగ్గా వారం ముందు ప్రారంభమయ్యే ఈ మండమెలిగే పండుగ విశేషాలు మీకోసం..
జాతర ఉత్సవాల్లో భాగంగా ప్రధాన పూజారి (వడ్డె) నేతృత్వంలోని బృందం తొలిరోజు మేడారంలోని సమ్మక్క గుడి వద్దకు చేరుకుంటారు. వన దేవతలకు వస్త్రాలు సమర్పిస్తారు. సారలమ్మ పూజారులు పూజలో పాల్గొంటారు. ముగ్గులు వేసి శక్తిపీఠాన్ని అందగా అలంకరిస్తారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పూజలు రాత్రి కూడా జరుగుతాయి. మరుసటిరోజు మేకపోతును బలిచ్చి వన దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. సారలమ్మ తల్లి నివాసమైన కన్నెపల్లిలో, గోవిందరాజు కొలువై ఉండే కొండాయిలో, పగిడిద్దరాజు నివాసం పూనుగొండ్లలో కూడా ఇవే తరహా పూజా కార్యక్రమాలను స్థానిక పూజారులు నిర్వహిస్తారు.
ఆదివాసీల ఆరాధ్య దైవాలైన వనదేవతల పూజా స్థలాలు నిరాడంబరమైనవిగా చెప్పాలి. మేడారంలో సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మల గుళ్లు గతంలో గుడిసెలుగానే ఉండేవి. జాతరకు ముందు ఈ గుడిసెలను కొత్త గడ్డితో కప్పడం ఆనవాయితీ. దీన్నే గుడిమెలిగే కార్యక్రమంగా వ్యవహరిస్తారు. ఈ ప్రక్రియతోనే జాతర తొలి పూజా కార్యక్రమాలు మొదలవుతాయి.
అయితే ప్రస్తుతం గుడెసెలు లేకున్నా జాతరకు రెండు వారాల ముందు ‘గుడి మెలిగె’ ప్రక్రియను నిర్వహిస్తారు. జాతరకు సరిగ్గా వారం ముందు దేవతలు ఉండే ఆవరణలను శుద్ధి చేసి ముగ్గులు వేసి శోభాయమానంగా అలంకరిస్తారు. దీన్నే ‘మండ మెలిగె’ కార్యక్రమంగా చెబుతారు. గుడి మెలిగె, మండ మెలిగె కార్యక్రమాలు తల్లుల వారంగా భావించే బుధవారాల్లో మాత్రమే నిర్వహిస్తారు. ‘మండ మెలిగె’ తర్వాత మరుసటి రోజున గురువారం మేకను వన దేవతలకు బలి ఇచ్చి పూజారులు (వడ్డె), గ్రామపెద్దలు పండుగ నిర్వహిస్తారు. ఇదే రోజును సమ్మక్క వారంగా భావించి భక్తులు తమ ఇళ్లను శుద్ధి చేసుకుని వనదేవతలకు పూజలు చేయడం విశేషం.