మరి కొన్ని గంటల్లో వన ప్రవేశం చేయనున్న సమ్మక్క-సారలమ్మ దేవతలను ఈసారి దర్శించుకోలేకపోయామే అని చింతిస్తున్నారా? జనం రద్దీకి భయపడో.. మరే ఇతరత్రా కారణాల వల్లనో ఇంకా మేడారం జాతరకు వెళ్లలేకపోయారా? కోట్లాది మంది భక్తులు వెళ్లి, వస్తున్నా మనం వెళ్లేలేకపోయామే అని మథనపడుతున్నారా? ఇప్పుడు బయలుదేరినా, వెళ్లేసరికి సమ్మక్క-సారలమ్మలు గద్దెలపై ఉండకపోవచ్చని, తిరిగి వనప్రవేశం చేసే ప్రక్రియ కూడా ముగుస్తుందని, వెళ్లినా నిష్ప్రయోజనమని బాధ పడాల్సిన అవసరం లేదు.
ఇటువంటి భక్తులకు మరో అవకాశం వెను వెంటనే ఉండడం విశేషం. దీన్నే ‘తిరుగు జాతర’ అంటారు. వనదేవతల దర్శనానికి ‘తిరుగు జాతర’ కూడా ఆహ్వానం పలుకుతుంది. ఇదేమిటీ..? అని సందేహించకండి. ఎప్పుడూ నిర్వహించే పద్ధతే. కాకపోతే చాలా మందికి ఈ ‘తిరుగు జాతర’ సంప్రదాయం గురించి తెలియకపోవడమే విశేషం. ఈనెల 5,6,7,8 తేదీల్లో సమ్మక్క-సారలమ్మల జాతరను సందర్శించిన భాగ్యమే ‘తిరుగు జాతర’లోనూ దక్కుతుందన్నది ఆదివాసీ తెగకు చెందిన సమ్మక్క వంశస్థుల నిర్వచనం. వచ్చే బుధ, గురు, శుక్రవారాల్లో.. అంటే 12, 13, 14,15 తేదీల్లో మేడారంలో తిరుగు జాతర నిర్వహిస్తారు. ప్రస్తుత జాతరకు రాలేకపోయిన భక్తులు ఈ సందర్భంగానూ వనదేవతలను దర్శనం చేసుకోవచ్చు.
‘తిరుగు జాతర’ ప్రాశస్త్యంపై మేడారం జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్ ఆలం రామ్మూర్తి ts29.inతో మాట్లాడుతూ, ఈ సమయంలోనూ భక్తులను సమ్మక్క-సారలమ్మలు కరుణిస్తారని చెప్పారు. అసలు జాతరకు దక్కిన దేవతల ఆశీర్వాదమే ‘తిరుగు జాతర’లోనూ లభిస్తుందన్నారు. ఓ రకంగా చెప్పాలంటే ‘పెళ్లికి రాలేకపోయిన బంధువులు రిసెప్షన్ కు హాజరైనట్లు’గా భావించవచ్చని ‘తిరుగు జాతర’పై ఒకే వాక్యంలో రామ్మూర్తి నిర్వచించారు. అందువల్ల మరికొద్ది గంటల్లోనే సమ్మక్క-సారలమ్మలు వన ప్రవేశం చేస్తారని, ఈసారి దర్శనం చేసుకోలేకపోయామని భక్తులు బాధ పడాల్సిన అవసరమే లేదు. మరో నాలుగు రోజుల్లోనే ‘తిరుగు జాతర’ జరుగుతుంది.