మేడారం జాతర.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర.. రాష్ట్ర పండుగ కూడా. రానే వచ్చింది. మరో వారం రోజుల్లో వన దేవతలైన సమ్మక్క-సారలమ్మ జాతర సంబురం అంబరాన్ని తాకనుంది. ఆ తర్వాత మూడు రోజుల్లో జాతర ముగుస్తుంది కూడా. ఇదిగో ఇటువంటి కీలక సమయంలో ములుగు జిల్లా పరిపాలనకు, ముఖ్యంగా మేడారం జాతర నిర్వహణ, పనుల పర్యవేక్షణ కోసం మరో ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం ఇంచార్జ్ కలెక్టర్ గా నియమించింది. కొత్తగా ఏర్పడిన జిల్లా వయస్సు ఏడాది కూడా నిండక ముందే, ముచ్చటగా మూడో కలెక్టర్ ను ప్రభుత్వం నియమించడం విశేషం.
గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భాగమైన ములుగును గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం జిల్లాగా ప్రకటించారు. తొలి కలెక్టర్ గా నారాయణరెడ్డి అనే ఐఏఎస్ అధికారి నిరుడు మార్చి 4వ తేదీన బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మేడారం జాతర నిర్వహణకు, భక్తుల సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం రూ. 75.00 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ పనుల పూర్తికి సంబంధించి కలెక్టర్ నారాయణరెడ్డి కాంట్రాక్టర్ల పట్ల కఠినంగా వ్యవహరించిన పరిస్థితుల్లోనే ఆయనను నిజామాబాద్ కలెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం గత నెల 22న ఉత్తర్వు జారీ చేసింది.
కోటిన్నర మందికి పైగా భక్తులు హాజరయ్యే మేడారం జాతర పనుల పర్యవేక్షణలో భాగంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించి సుమారు 35 రోజులు మాత్రమే కావడం గమనార్హం. మరో వారం రోజుల్లో… అంటే ఫిబ్రవరి 5వ తేదీన జాతర ప్రారంభం కానుంది. 8వ తేదీన జాతర ముగుస్తుంది కూడా. కానీ ఇప్పటికీ మేడారం జాతర పనులు పూర్తి కాకపోవడమే అసలు విశేషం. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని ఉన్నతాధికారులు, మంత్రులు ఎంతగా మొత్తుకుంటున్నా పనులు మాత్రం సా….గుతూనే ఉన్నాయి. మరోవైపు లక్షలకు లక్షలుగా భక్తులు మేడారానికి ముందుగానే వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే జాతర నిర్వహణకు కేవలం వారం రోజుల ముందు ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణణ్ ను ములుగు ఇంచార్జ్ కలెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత జాతరలోనూ ఆయన ఇంచార్జ్ కలెక్టర్ గా వ్యవహరించారు. సమర్థవంతంగా జాతర నిర్వహించిన చరిత్ర కర్ణణ్ కు ఉంది. కానీ జాతర పనులను గాడిలో పెట్టేందుకు కర్ణణ్ ముందు గల సమయం కేవలం వారం రోజులు మాత్రమే. భక్తుల తాకిడి తీవ్రం కావడానికి మరో నాలుగు రోజులు మాత్రమే ఉంది. కానీ నత్తనడకను తలపిస్తున్నట్లు చెబుతున్న జాతర పనులను ఈ స్వల్ప వ్యవధిలో కర్ణణ్ గాడిలోకి తీసుకువస్తారనే నమ్మకంతోనే ప్రభుత్వం ఆయనకు ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించింది. మేడారం సమ్మక్క తల్లి ఆశీస్సులతో కలెక్టర్ కర్ణణ్ ఈ విషయంలో సఫలీకృతం కావాలని, భక్తులు ఎటువంటి ఇబ్బందుల పాలు కాకూడదని ఆశిద్దాం.