ప్రతాపరుద్రుని యుద్ధమే లేదా? ‘మేడారం దేవుళ్లు’ ఎలా అయ్యారు? – 2
లిఖిత ఆధారం, భౌతిక శాసనం, వస్తు సముదాయం ప్రకారం మాత్రమే చరిత్ర ఉంటుంది. ఇవేవీ లేకుండా చరిత్రగా పరిగణించరు. కానీ కొన్ని చరిత్రలకు ‘జనశ్రుతి’ని కూడా ప్రామాణికంగానే భావిస్తుంటారు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుని సేనలతో యుద్ధక్షేత్రంలో అమరులైనట్లు ప్రాచుర్యంలో గల మేడారం సమ్మక్క కుటుంబీలకు ఎప్పటి నుంచో మరో ‘గిరిజన శ్రుతి’ ఉంది. కానీ లిఖితపూర్వకంగా అది జనబాహుళ్యంలో ప్రాచుర్యం పొందకపోవడమే ఆశ్చర్యకర పరిణామం. ఆదివాసీ జాతిలో సమ్మక్క వంశస్తులు, మేడారం జాతర హుండీ ఆదాయ వాటాదారులు కొందరు చెబుతున్న కథనం ప్రస్తుత చరిత్రకు పూర్తి విరుద్ధం కావడం గమనార్హం. సమ్మక్క కుటుంబీకుల్లో సంబంధ, బాంధవ్యాల్లోనూ అనేక వ్యత్యాసాలు ఉండడం కూడా మరో విశేషం.
సమ్మక్క-సారలమ్మలను భక్తులు వన దేవతలుగానే ఆరాధిస్తున్నారు. వనంలో లభించేవాళ్లు మాత్రమే వన దేవతలవుతారన్నది ఆదివాసీల నిర్వచనం. ప్రకృతిని ఆరాధించేవాళ్లు ఆదివాసీలు. వాస్తవ పరిస్థితుల్లో ఆదివాసీలకు ఏటా వచ్చేవి ఆరు పండుగలు మాత్రమే. విత్తనాల సమయంలో చేసే భూమి పూజను ‘విత్తు పండుగ’, వరి, మొక్కజొన్న వంటి పంటలు కంకులు వేసే సమయాన్ని ‘పొట్ట పండుగు’, మనం పితృ అమావాస్యగా వ్యవహరించే కాలాన్ని ‘కొత్తల పండుగ’, కోపిరి, చీపురు తదితర అడవి ధాన్యం చేతికొచ్చే వేళ ‘పచ్చ పండుగ’, చిక్కుళ్లు వంటి అటవీ ఉత్పత్తులు లభ్యమయ్యే సమయాన్ని ‘మండ మెలుగుడు’, అమ్మవారి పండుగ (జాతర)లు మాత్రమే ఆదివాసీల సంబరాలకు ప్రతీకలు. ఆదివాసీ జాతరల్లో విగ్రహారాధన ఉండదు. చెట్టూ, పుట్టా (రెండూ కలిసి ఉంటేనే), రాళ్లను ఆదివాసీలు ఆరాధిస్తుంటారు. వందలు, వేల ఏళ్లుగా ‘షికారు’ (వేట) ఆదివాసీల జీవనశైలిలో ఓ భాగం. దుప్పులు, జింకలు, తెల్లగడ్డలు, నల్లేరుగడ్డలు, ఎల్లేరు గడ్డలు, చేపలు తదితర అటవీ ఉత్పత్తులు ఆదివాసీల ఆహారం. ఒకరిద్దరు కాకుండా బృందాలుగా ‘షికారు’కు వెళ్లడం ఆదివాసీల ఆహారపు వేటలో ఓ భాగం.
ఇదిగో ఈ షికారు సమయంలోనే ఆదివాసీల బృందానికి ఓసారి కళ్లు నలుముకుని తిలకించే అద్భుత దృశ్యం సాక్షాత్కరించింది. బయ్యక్కపేట సమీపంలోని కీకారణ్యంలో గల దేవునిగుట్ట (సమ్మక్క గుట్ట) వద్ద ‘కంక’ (వెదురు) వనంలో పులులు, సింహాల మధ్యలో ఓ పాప కనిపించింది. షికారు ఆయుధాలతో ఆదివాసీల బృందాన్ని చూసిన క్రూర మృగాలు అక్కడి నుంచి వెళ్లిపోగా, బయ్యక్కపేటకు చెందిన ‘చందా’ వంశస్తులు పాపను తీసుకువచ్చారు. చందా వంశానికి చెందిన కోయదొర ఇంట ఆ పాప పెరుగుతోంది. ఆమె పేరే సమ్మక్క.
బయ్యక్కపేట పొరుగున గల మేడారంలో నివసించే జలాసముద్రుడు-శశి మందాకినిల కుమారుడు పగిడిద్దరాజుకు వివాహ వయస్సు వచ్చింది. బయ్యక్కపేట కోయదొర ఇంట పెరుగుతున్న సమ్మక్కను తమ ఇంటి కోడలిగా అడగడానికి పగిడిద్దరాజు కుటుంబీకులు వెళ్లారు. అప్పటికే బయ్యక్కపేటలో సమ్మక్క అందరితో కలుపుగోలుగా ఉంటూ, స్నేహితులతో టీమ్ గా సంచరిస్తూ అడవి, చెరువుల, పొలాల వెంట తిరుగుతుండేది. బయ్యక్కపేట గ్రామంలో జ్వరం, జలుబు వంటి జబ్బుల బారిన పడినవారిని సమ్మక్క తన చేయితో వారి జబ్బ మీద చరిస్తే వ్యాధులు మటుమాయం అయ్యేవట.
ఈ నేపథ్యంలోనే వివాహం చేసుకునే యోచనలో భాగంగా బయ్యక్కపేటకు వెళ్లిన పగిడిద్దరాజు ఏదో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ ఉండేవారట. ఇదే విషయాన్ని సమ్మక్క ‘టీం’లోని స్నేహితులు ఆమెకు చెప్పారు. మనం పూలు-పండ్లుగా వ్యవహరించే ప్రక్రియను ఆదివాసీ ఆచారంలో ‘రైకలు’ గా వ్యవహరిస్తారు. అంటే వివాహ నిశ్చయ సందర్భంగా ‘జాకెట్’ ముక్కలు పరస్పరం మార్చుకోవడాన్నే ‘రైకలు’గా పిలిచేవారు. ఈ సందర్భంగానే సమ్మక్క చేయి పగిడిద్దరాజుకు తగిలింది, అయితే అంతుచిక్కని వ్యాధితో బాధపడతున్నట్లు తన స్నేహితుల ద్వారా విన్న సమ్మక్క పగిడిద్దరాజు వివాహం చేసుకోనని తిరస్కరించింది. వధూ, వరులు పరస్పరం చూసుకునే ఆచారం ఆదివాసీల్లో అప్పట్లో లేకపోవడమే ఇందుకు కారణం. ’పిల్ల’నిస్తాను.. అని మాటిచ్చిన సమ్మక్కను పెంచుకుకున్న చందా వంశపు దొర మాటకు కట్టుబడే గిరిజన పెద్ద. సమ్మక్క నిరాకరణతో ఏం చేయాలో పాలుపోక తన సొంత కూతురైన నాగులమ్మను పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు. ఆదివాసీ ఆచారం ప్రకారం పెళ్లిళ్లు ఇప్పటికీ వరుడి ఇంట్లోనే జరుగుతుంటాయి. ఇందులో భాగంగానే పగిడిద్దరాజు-నాగులమ్మల వివాహానికి ఆచారం ప్రకారం సమ్మక్క ‘తోడు పెళ్లి పడుచు’గా మేడారం వచ్చింది. అయితే వరుడి రూపంలో గల పగిడిద్దరాజును తొలిసారి చూసిన సమ్మక్క తన చూపును తిప్పుకోలేకపోయింది. ఆరడుగుల ఆజానుబాహుడైన పగడిద్దరాజు అత్యంత ఆకర్షణీయ అందగాడుగా మెరిసిపోతుంటే తాను నిరాకరించిన పగిడిద్దరాజు ఇతనేనా? అని కాసేపు దీర్ఘాలోచనలోకి వెళ్లిందట.
పెళ్లి ప్రక్రియ కొనసాగుతోంది. మైలపోలు, తల్వాలపోలు, లగ్గంపోలు సాగుతున్న సమయంలో అనూహ్యంగా అక్క నాగులమ్మను పక్కకు నెట్టేసిన సమ్మక్క తానే పెళ్లి పీటల మీద కూర్చుంది. హఠాత్పరిణామంతో పెళ్లికి హాజరైన పెద్దలు తేరుకునేలోపే పెళ్లి పందిట్లో పెనుగులాట మొదలైంది. పగిడిద్దరాజు తొలుత తనకోసమే బయ్యక్కపేటకు వచ్చాడని, తాను మాత్రమే అతన్ని పెళ్లి చేసుకోవాలని సమ్మక్క గొడవ చేసింది. దీంతో ఇద్దరికీ తాళి కట్టాలని పెళ్లి పెద్దలు పగిడిద్దరాజుకు సూచించారు. కుల పెద్దల సూచనతో పగిడిద్దరాజు నాగులమ్మకు, సమ్మక్కకు తాళి కట్టేశాడు. కత్తి, కంకణ ధార ప్రక్రియలో సమ్మక్క చేతిలోని త్రిశూలం తగిలి పెళ్లి వేదికపైనే పగిడిద్దరాజు ఓ కన్ను కోల్పోయాడు. అతని కనుగుడ్డు ఎక్కడో ఎగిరి పడిపోయింది. దాంతో పెళ్లికి హాజరైన ఆదివాసీ పెద్దలతోపాటు పలువురు సమ్మక్క చేష్టలను నిందించారు. దీంతో తీవ్రంగా కలత చెందిన సమ్మక్క పగిడిద్దరాజు కన్నును తన చేతితో తడిమి చూసింది. ఆశ్చర్యం.. సమ్మక్క చేయి తగలగానే పగిడిద్దరాజు కన్ను మళ్లీ వచ్చిందట.
ఈ ఘటనానంతరం కొంత కాలానికి సమ్మక్క కదిలే పరిస్థితి లేని పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమ పంట, ఫలం బాగా వృద్ధి చెందాలని ప్రజలు ఆమెకు పూజలు, పునస్కారాలు చేయడం ప్రారంభించారు. ఆమె చేయి తగిలితే వ్యాధులు మటుమాయం కావడం, సంచరించిన ప్రదేశాలు సుభిక్షంగా మారడంతో జనం తాకిడి ఎక్కువైంది. తమ కష్టాలు తీర్చడానికి అవతరించిన దేవతగా ఆరాధించారు. అయితే ప్రజలు స్వీయ క్షేమాన్ని కోరుకుంటే తప్పులేదు, కానీ పక్కవారి నాశనాన్ని కోరుకుంటూ, తన వద్దకు వచ్చే జన సంఖ్య పెరగడం సమ్మక్కకు నచ్చలేదట. జనం కోరుతున్న ఇటువంటి స్వార్థపూరిత, వింత కోరికల పట్ల సమ్మక్క తీవ్రంగా ఆవేదన చెందారు. ప్రజల సంకుచిత, స్వార్థ బుద్ధిని భరించలేక, జనం కోరుతున్న వింత, వినాశకర కోరికలను తీర్చలేక సమ్మక్క అదృశ్యమైంది. చిలుకల గుట్టవైపు వెడుతున్న తల్లి సమ్మక్కను అనుసరించిన సంతానం సారలమ్మ, జంపన్నలు కూడా తల్లితోపాటు అదృశ్యమయ్యారట. ఆ తర్వాత ఆదివాసీ పెద్దల కలలో కనిపించిన సమ్మక్క చిలుకల గుట్ట పైన గల కుంకుమ భరిణెను తన ప్రతిరూపంగా భావించి ఆరాధించాల్సిందిగా సమ్మక్క ఆకాంక్షించింది. ప్రతి ఏటా తన పేరున పండుగ (జాతర) జరపాలని కోరింది.
అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏటా జాతర జరపడం ఆదివాసీలకు సాధ్యపడలేదు. తమ జీవన భ్రుతిలో భాగంగా ఆదివాసీలు అడవుల వెంట పయనిస్తూ ఛత్తీస్ గఢ్, ఒడిషా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో తిరుగుతూ మాఘ శుద్ధ పౌర్ణమికి మేడారం చేరుకునేవారు. సాయంత్రం ఆరు నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు ఉండే మాఘ శుద్ధ పౌర్ణమి వెలుతురులోనే సమ్మక్క తల్లి జాతర జరిపేవారు. సమ్మక్క చందా వంశస్థులకు లభ్యమైన ఘటన, ఆమె పెళ్లిరోజు కూడా మాఘ శుద్ధ పౌర్ణమి రోజుగానే గిరిజనులు చెబుతుంటారు. నూనె దీపాలు, కాగడాలతో చిలుకలగుట్ట నుంచి అమ్మవారి ప్రతిరూపంగా కొలిచే కుంకుమ భరిణెను వేడుకగా గద్దెల వరకు తీసుకువచ్చేవారు. ఆదివాసీల ఇంట జరిగే అనేక శుభకార్యాల్లో ఇప్పటికీ నూనెదీపాలు, కాగడాలను వాడుతుంటారు. తొలుత గిరిజన పండుగగా మాత్రమే ప్రారంభమైన మేడారం జాతర కాలక్రమేణా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా, తెలంగాణా కుంభమేళాగా ప్రాచుర్యం పొందడం గమనార్హం. మేడారం జాతర 1952లో దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లాకే సమ్మక్క తల్లి చరిత్రను వక్రీకరించారనేది ఆదివాసీ వర్గాల వాదన. కాకతీయ రాజు ప్రతాపరుద్రుని యుద్ధ చరిత్రలో సమ్మక్క-సారలమ్మల ప్రస్తావనే లేదని కూడా వారు చెబుతున్నారు. కొందరి స్వార్థం కోసం మేడారం జాతర ప్రాశస్త్యంలోకి కాకతీయ సేనలు, యుద్ధం వంటి దృశ్యాలను ఆపాదించారనేది ఆదివాసీల అభిప్రాయం.
కాకతీయ సామ్రాజ్యంలో అద్భుత పాలన సాగించిన ప్రతాపరుద్రుని వంటి గొప్ప చక్రవర్తి అడవులను నమ్మకుని బతికే ఆదివాసీలపై యుద్ధం చేశాడంటే తాము ఎప్పటికీ నమ్మబోమని మేడారం జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మెన్ ఆలం రామ్మూర్తి ts29.inతో చెప్పారు. 13వ శతాబ్ధపు కాకతీయ చరిత్రలో సమ్మక్క ప్రస్తావన కూడా లేదని ఆయన గుర్తు చేశారు. అమరత్వంలో హిందూ సంప్రదాయం ప్రకారం ‘గోవిందా’ నామస్మరణ చేస్తుంటామని, కానీ మేడారం జాతరలో ‘జై సమ్మక్క, జై సారలమ్మ’ నినాదాలు మాత్రమే ఉంటాయనే అంశాన్ని గుర్తుంచుకోవలసి ఉంటుందని రామ్మూర్తి ఈ సందర్భంగా చెప్పారు. సమ్మక్క ఆది నుంచీ దేవతేనని, మధ్యలోనే మనుషుల్లో జీవించిందని రామ్మూర్తి నిర్వచించారు. నాగులమ్మ సమ్మక్క కూతురు కాదని, పగిడిద్దరాజు భార్యేనని, సమ్మక్కకు సవతి అని కూడా ఆయన స్పష్టం చేశారు. తమ పూర్వీకుల కాలం నుంచి ఈ చరిత్ర తరాల వారీగా వింటున్నదేనని రామ్మూర్తి పేర్కొన్నారు. చరిత్రను ఎవరికి తెలిసిన విధంగా వారు రాస్తున్నారని, నాగులమ్మ పగిడిద్దరాజు భార్యేనని సమ్మక్క వంశస్తుడైన చందా వీరయ్య దొర కూడా స్పష్టం చేశారు.
మేడారం జాతర చరిత్రలో, కాకతీయుల యుద్ధం అనే అంశంలో చారిత్రక ఆధారాలు లేని మాట వాస్తవమేనని కాకతీయ యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్ విజయ్ బాబు అన్నారు. అడవిలో చేసుకునే ఆదివాసీ జాతరకు చారిత్రక ఆధారాలు కూడా ఉన్న దాఖలాలు లేవన్నారు. ఆదివాసీలకు సంబంధించి లిఖిత ఆధారం, భౌతిక శాసనాలు, వస్తు ఆనవాళ్లు లేకపోవడమే కారణమన్నారు. అయితే గొప్ప పరిపాలకుడైన ప్రతాపరుద్రుడు ఆదివాసీలపై యుద్ధం చేయకపోవచ్చనే వాదనపైనా ఆయన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎంత గొప్ప చక్రవర్తి అయినప్పటికీ, రాజ్యవిస్తరణ సందర్భంగా తిరుగుబాట్లను సహించక పోవచ్చన్నారు. కాకతీయ సామ్రాజ్య విస్తరణ సందర్భంగా ఆదివాసీ గిరిజనుల నుంచి తిరుగుబాటు జరిగి ఉండవచ్చని, దీన్ని సహించలేని ప్రతాపరుద్రుడు యుద్దం ప్రకటించి ఉండవచ్చని, ఆర్గనైజ్డ్ కాకతీయ సేనల ధాటికి సమ్మక్క కుటుంబీకులు అమరులై ఉండే అవకాశం లేకపోలేదన్నారు. అయితే ఇందుకు ఎటువంటి చారిత్రక ఆధారాలు మాత్రం లేవనేది మాత్రం వాస్తవమని విజయబాబు వివరించారు.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం అంశంలో చరిత్రపై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటిగానే భావించాల్సి ఉంటుందనేది నిర్వివాదాంశం. కానీ కోట్ల మంది భక్తుల విశ్వాసం ప్రకారం మేడారం సమ్మక్క-సారలమ్మలు మహిమ గల వన దేవతలు. కోర్కెలు తీరిన భక్తులు సమర్పించే నిలువెత్తు బంగారపు మొక్కులే ఇందుకు నిదర్శనం. ఇది మాత్రం ఎవరూ కాదనలేని అసలు చరిత్ర.