మేడారం జాతరలో మరికొద్ది గంటల్లో మరో కీలక ఘట్టం సాక్షాత్కరించబోతోంది. అశేష సంఖ్యలో హాజరైన తన భక్తులకు దర్శనమిచ్చిన వనదేవతలైన సమ్మక్క-సారక్కలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు వన ప్రవేశం చేయనున్నారు. జాతర ముగింపులో భాగంగా వన ప్రవేశం సహజ ప్రక్రియే కదా? ఇందులో విశేషమేముందీ..? అని అప్పుడే ప్రశ్నించకండి. అక్కడే ఉంది అసలు ప్రత్యేకత.
సమ్మక్క జాతర అనగానే సహజంగా మాఘ శుద్ధ పౌర్ణమి గుర్తుకు వస్తుంది. ఎక్కువ జాతరలు పౌర్ణమి వేళలోనే జరిగిన చరిత్ర మేడారానికి ఉంది. ఇందుకు జాతర గత నేపథ్యం కూడా ఉంది. మేడారం జాతర తొలిసారి నిర్వహించిన సందర్భంగా ఎటువంటి వెలుతురు లేకపోవడం వల్లనే మాఘ శుద్ధ పౌర్ణమిని గిరిజన దేవతల ఉత్సవానికి దిక్సూచిగా ఎంచుకున్నట్లు ఆదివాసీలు చెబుతుంటారు. అప్పట్లో ఇప్పనూనె దీపాల, కాగడాల వెలుతురులోనే జాతర నిర్వహించేవారట. కాలక్రమేణా విద్యుత్ వెలుగుల్లో జాతర వైభవం జిగేలుమంటోందే తప్ప, దశాబ్ధాల క్రితం వరకు కూడా నిండు పున్నమి వేళల్లోనే జాతరకు హాజరైన భక్తులు తమ ఇలవేల్పులను కొలిచేవారు.
ఏకబిగిన పన్నెండు గంటలపాటు వెలుతురుగా ఉండడమే మాఘ శుద్ధ పౌర్ణమి స్పెషాలిటీగా ఆదివాసీలు చెబుతుంటారు. సాధారణంగా మేడారం జాతర తేదీల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా పౌర్ణమి తిథి దాఖలాలు ఉన్నాయి. అది జాతర ప్రారంభం రోజు కావచ్చు, మధ్యలో లేదా కనీసం ముగింపు రోజైనా కావచ్చు. కానీ ఈసారి జాతర ముగిసిన మరుసటి రోజున మాఘ శుద్ధ పౌర్ణమి వస్తుండడం గమనార్హం. తిథి ప్రకారం ఈనెల 9వ తేదీన నిండు పున్నమి వెన్నెల సాక్షాత్కరిస్తుంది. కానీ శనివారమే అంటే 8వ తేదీనే సమ్మక్క-సారక్క కుటుంబీకులు జనప్రవేశం నుంచి వనప్రవేశం చేస్తుండడం విశేషం.
ఇదే అంశంపై మేడారం జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మెన్ ఆలం రామ్మూర్తిని ప్రశ్నించగా, ఇందులో తప్పేమీ లేదని, అనుమానించడానికి ఎటువంటి ఆస్కారం కూడా లేదన్నారు. మాఘ మాసపు పౌర్ణమి వెలుతురును మాత్రమే జాతర నిర్వహణకు సూచికగా భావిస్తుంటామన్నారు. కానీ వనదేవతలు జనప్రవేశం చేశాక చాలా అరుదుగా మాత్రమే మాఘ శుద్ధ పౌర్ణమి వస్తుందని, ఒక్కోసారి 20 ఏళ్లకు కూడా సరిగ్గా జాతర తేదీల ప్రకారం పౌర్ణమి రాదన్నారు. సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణలో తేదీలు, పౌర్ణమి ప్రామాణికం కాదన్నారు. బుధ, గురు, శుక్రవారాలను మాత్రమే తాము కీలకంగా భావిస్తామని, శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో దేవతలను వన ప్రవేశం చేయించాల్సిందేనని రామ్మూర్తి వివరించారు. ఇందులో రాజీ కూడా ఉండదన్నారు. జాతర నిర్వహణ తేదీల విషయంలో అష్టమి వచ్చినా, కష్టం వచ్చినా పట్టింపులు ఉండవని, వనదేవతలకు ప్రీతిపాత్రమైన బుధ, గురు, శుక్ర వారాలు మాత్రమే అత్యంత ముఖ్యమని వివరించారు. అయితే ఆయా వారాల తేదీలు మాఘ శుద్ధ పౌర్ణమికి ముందైనా, తర్వాతైనా ఉండడం సహజమన్నారు.