ఎయిర్ పోర్టులో లారీల లీజుల పేరుతో భారీ ఎత్తున మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. తక్కువ సమయంలో అధిక డబ్బు సులభంగా సంపాదించడమే లక్ష్యంగా ఎయిర్ పోర్టులో కార్గో సర్వీస్ ల పేరుతో లారీలను లీజుకు తీసుకుంటామని లారీ యజమానులకు మోసగిస్తున్నవారి ఆటను కట్టించారు. పోలీసుల కథనం ప్రకారం… ప్రస్తుతం హైదరాబాద్ లోని కుషాయిగూడలో నివాసముంటున్న దూళ్ల నాగేశ్వర రావు @ హరీష్ @ ప్రభాకర్ (49)కు జీడిమెట్ల, షాపూర్ నగర్ కు చెందిన కుక్కల శ్రీనివాస్ @ చౌదరి @ లవరాజు (52) తో గత పది సంవత్సరాల నుంచి పరిచయం ఉంది . వీరిద్దరూ రోడ్డుపై వెళ్లే, పార్కింగ్ చేసిన లారీల నెంబర్లు, లారీలపై రాసి ఉండే యజమానుల ఫోన్ నెంబర్లు తీసుకొని, ఆ యజమానుల వివరాలు తెలుసుకొని వివిధ నెంబర్లతో వారికి ఫోన్లు చేస్తుంటారు. తమకు శంషాబాద్ లోని విమానాశ్రయంలో వాటర్ బాటిల్ సరఫరా కాంట్రాక్ట్ ఉందని చెబుతూ, మీ లారీని మాకు లీజుకు ఇచ్చినట్లయితే నెలకు రెండు లక్షల రూపాయలు చెల్లిస్తామని ఆశ చూపిస్తారు. ఆ తర్వాత వారి పథకం ప్రకారం ఎయిర్ పోర్టులో ఎంట్రీ పాస్ కోసం కొంత డబ్బును డిపాజిట్ చేయించుకుంటూ, అనంతరం గుర్తింపు కార్డు, వివిధ రకాల పత్రాలు తయారు చేయించడం, ఇతరత్రా ఖర్చుల కోసం కొంత డబ్బులు అవసరం పడుతాయని వారిని పదేపదే నమ్మిస్తూ, వారు పట్టుబడకుండా ఉండాలనే ఉద్ధేశంతో వేరే వ్యక్తిని పరిచయం చేసుకొని మాయ మాటలు చెప్పి అతని అకౌంట్లలో డబ్బులను జమ చేయించి విత్ డ్రా చేయించుకొని అనంతరం ఆ సెల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేస్తారు.
వీరు 2007 నుండి 2012 ,2015 లలో ఇదే తరహా మోసాలకు పాల్పడుతూ హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాలైన జగద్గిరిగుట్ట , జీడిమెట్ల, శామీర్ పేట్ , ఆల్వాల్ ప్రాంతాలలో మోసాలు చేస్తూ పోలీసులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాలేదు , మళ్ళీ ఆదే తరహా నేరాలకు పాల్పడుతూ ఈ సంవత్సరం ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో వివిధ లారీ యజమానులకు ఫోన్లు చేయగా అందులో ఐదుగురు లారీ యజమానులు సుమారు 15 లక్షల 25వేల రూపాయల వరకు మోసపోయారు .
కరీంనగర్ జిల్లాకు చెందిన కొంత మంది లారీ యజమానులకు కూడా ఫోన్ చేయగా, ఓ లారీ యజమాని వారి మాటలు నమ్మి మోసపోయి 1,56 ,000 /- రూపాయల నగదును వారు ఇచ్చినటువంటి అకౌంట్లో డబ్బును డిపాజిట్ చేసి మోసపోయారు. విషయంపై బాధితుడు కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి బి కమలాసన్ రెడ్డిని సంప్రదించి తాను మోసపోయిన విధానాన్ని తెలుగా , కమీషనర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, టూ టౌన్ ఇన్స్పెక్టర్ పక్కా సమాచారంతో వీరిని ఆర్టీసీ వర్క్ షాప్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.
వీరి వద్ద నుంచి లక్ష రూపాయల నగదు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం, 1-ఏటీఎం కార్డు , 4- సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసగాళ్లను పట్టుకోవడంలో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్లు బి. మల్లయ్య , సృజన్ రెడ్డి, ఎస్సై కరుణాకర్ , ఏఆర్ఎస్ఐ నర్సయ్య, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ బాబు, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ మురళి కీలక పాత్ర పోషించారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన టీం సభ్యులను కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి అభినందించారు .