హలో… మేం సీఎం పేషీ నుంచి మాట్లాడుతున్నాం.
ఎవరు సార్… మాట్లాడేది?
పేరు ఎందుకుగాని, మేం సీఎం ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాం.
చెప్పండి సర్?
విజయ్ కుమార్ తెలుసా… మీకు?
ఏ విజయ్ కుమార్ సార్?
సీఎంగారి పీఆర్వో విజయ్ కుమార్.
హా… తెలుసు సర్. ఎందుకు?
ఆయన ఈ మధ్య మీకు ఫోన్ చేశారా?
దేని గురించి సర్?
ఏవేని పనులు చేస్తామని చెప్పారా?
……..
ఫరవాలేదు చెప్పండి… విజయ్ మనోడే కదా? మీరూ మన పార్టీ కార్యకర్తలే. తప్పేమీ లేదు… చెప్పండి. పనులు చేస్తామని ఏమైనా డబ్బు తీసుకున్నారా?
………
ల్యాండ్ ఫోన్ నుంచి వారం రోజుల క్రితం అధికార పార్టీ నేతలకు వచ్చిన ఫోన్ కాల్ సంభాషణల్లోని కొంత భాగం ఇది. సీఎం ఆఫీసు నుంచి వచ్చిన ఈ ఫోన్ కాల్ ప్రశ్నలకు అవతలి వ్యక్తులు ఏం సమాధానం చెప్పారనేది ఇప్పటికీ రహస్యమే. కానీ సీఎం పీఆర్వో విజయ్ కుమార్ తన పదవికి, ట్రాన్స్ కో జనరల్ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేయడానికి ముందు జరిగిన విచారణ కసరత్తుగా తెలుస్తోంది. తెలంగాణా వ్యాప్తంగా అధికార పార్టీకి చెందిన అనేక మంది ముఖ్య నాయకులకు, కొందరు కార్యకర్తలకు ఇదే తరహాలో ఫోన్ కాల్స్ వచ్చాయి. చివరికి సీఎం కేసీఆర్ తనయుడైన ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన నాయకులకు కూడా ఇదే తరహా ఫోన్ల ద్వారా సమాధానాలను రాబట్టినట్లు సమాచారం. పీఆర్వో పదవికి రాజీనామాకు వ్యక్తిగత కారణాలే కారణమని విజయ్ కుమార్ ప్రకటించినప్పటికీ, అనేక కథనాలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయ్ కుమార్ కార్యకలాపాల గురించి సీఎం పేషీ పేరుతో పోన్ కాల్స్ చేసి పార్టీ నాయకులను ఆరా తీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇదిలా ఉండగా విజయ్ కుమార్ రాజీనామా ఘటనకు ముందు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ నుంచి కూడా కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్లు వచ్చినట్లు సమాచారం. విజయ్ కుమార్ గురించి సంతోష్ వారి నుంచి అభిప్రాయాలను కోరగా, పలువురు ఎమ్మెల్యేలు తమదైన శైలిలో సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. పీఆర్వో విజయ్ రాజీనామా పర్వంలో ఈ పోన్ కాల్స్ ద్వాారా పార్టీ నేతలను ఆరా తీశారనే అంశం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో విజయ్ కుమార్ కు చెందినట్లు భావిస్తున్న అనేక ఆస్తులను అధికారగణం కనుగొందనే సరికొత్త ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. దాదాపు వారం క్రితం ఈ తరహా ఫోన్లు రాగా, ఈనెల 1న విజయ్ తన ఉద్యోగానికి రాజీనామా చేయడం, 3వ తేదీన విషయాన్ని తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా తనే స్వయంగా వెల్లడించడం తెలిసిందే.