ఖమ్మం జిల్లా పోలీసులు అదృష్టవశాత్తు భారీ పేలుడు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ పేలుడు ధాటికి ఖమ్మం నగరంలోని కొన్ని ప్రాంతాల ఇళ్లు కూడా కంపించాయంటే తీవ్రతను అవగతం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెడితే… ఖమ్మం రూరల్ మండలంలో పోలీసులు ఇటీవల భారీ ఎత్తున పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. అందులో ‘బ్లాక్ పౌడర్’తో పాటు డిటొనేటర్లు, జిలిటిన్ స్టిక్స్ ఉన్నాయి. అయితే పెద్ద ఎత్తున పట్టుబడిన ఆయా పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేయాల్సిందిగా కోర్టు ఆదేశించినట్లు సమాచారం. దీంతో హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా రప్పించిన పేలుడు పదార్థాల నిర్వీర్యపు (బాంబ్ డిస్పోజల్) టీమ్ తోపాటు ఖమ్మం రూరల్ స్టేషన్ కు చెందిన పోలీసులు ఈ ప్రక్రియను నిర్వహించేందుకు తనగడంపాడు-మంగళగూడెం ప్రాంతానికి గురువారం వెళ్లారు.
తొలుత డిటొనేటర్లను, జిలిటిన్ స్టిక్స్ ను విజయవంతంగా నిర్వీర్యం చేశారు. ఆ తర్వాత బ్లాక్ పౌడర్ బస్తాను నిర్వీర్యం చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఓ పెద్ద గొయ్యి తవ్వి అందులో బ్లాక్ పౌడర్ బస్తాను వేసి ట్యాంక్ ద్వారా తీసుకువచ్చిన నీళ్లతో తడుపుతూ నిర్వీర్యం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అయితే నిర్వీర్యపు ప్రక్రియను నిర్వహించేందుకు తీసుకువచ్చిన జేసీబీ యంత్రంతో బ్లాక్ పౌడర్ బస్తాను కదిలిస్తుండగా నిప్పు రవ్వ రాజుకుని భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి జేసీబీ యంత్రపు తొండం విడిపోయి ఎగిరిపడిందంటే తీవ్రతను అంచనా వేసుకోవచ్చు. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే గల దాదాపు ఇరవై మంది పోలీసులు అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
కాగా ఈ పేలుడు తీవ్రత ప్రకంపనల ప్రభావం ఖమ్మం నగరంలోని రాపర్తినగర్, బీసీ కాలనీ తదితర ప్రాంతాల్లోనూ కనిపించింది. ఘటన జరిగిన తనగడంపాడు, మంగళగూడెం తదితర పరిసర గ్రామాల్లో పేలుడు శబ్ధం మరింత ఆందోళనకరంగా వినిపించిందంటున్నారు. మొత్తం ఘటనలో అసలు విషయం ఏమిటంటే జిలిటిన్ స్టిక్స్, డిటొనేటర్లు అంతకు ముందే వేరే ప్రదేశంలో నిర్వీర్యం చేశారు. బ్లాక్ పౌడర్ బస్తా పేలుడు సందర్భంగా డిటొనేటర్లు, జిలిటిన్ స్టిక్స్ కూడా ఉండి ఉంటే పరిస్థితి మరోవిధంగా ఉ:డేదంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లోనూ వాతావరణం వేరే విధంగా ఉండేదని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ భారీ పేలుడు ఘటన నుంచి ఎటువంటి ప్రాణనష్టం లేకుండా తప్పించుకోవడం తమ అదృష్టంగానే పోలీసుల వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. కాగా నిర్వీర్యపు ప్రక్రియ సందర్భంగా ‘స్పార్క్’ రావడం వల్లే పేలుడు సంభవించినట్లు రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డి చెప్పారు.