చూశారుగా…! రైతుల కోసం ప్రత్యేకంగా ఓ మ్యారేజ్ బ్యూరో ఏర్పాటైంది. కులాలవారీగా, హోదాలవారీగా, ప్రవాసాంధ్ర సంబంధాల పేరుతో వివిధ రకాల మ్యారేజ్ బ్యూరోలు అనేకంగా ఉన్నాయి. కానీ రైతు కోసం ఇప్పటివరకు మ్యారేజ్ బ్యూరో ఉన్న దాఖలాలు లేవు.
కరీంనగర్ జిల్లాకు చెందిన కేతిరెడ్డి అంజిరెడ్డి అనే వ్యక్తి దీన్ని స్థాపించారు. ఆయన తన ప్రకటనలో ఏమంటున్నారో గమనించారుగా? తెలంగాణా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలు మాత్రమే పెళ్లి సంబంధాలకు సంప్రదించాలని, వ్యవసాయం చేసే యువతీ, యువకులు మాత్రమే తమను సంప్రదించాలని, ఇతరుల పెళ్లి సంబంధాల కోసం దయచేసి తమవైపు కూడా చూడవద్దని అంజిరెడ్డి తన ప్రకటనలో విస్పష్టంగా వివరించారు.
రైతుకు పిల్లనెవడిస్తాడు? అనే ప్రశ్నలు తలెత్తుతున్న పరిణామాల్లో ఏకంగా రైతులకోసం, రైతు కూలీల కోసం పెళ్లిళ్ల పేరయ్యగా అంజిరెడ్డి బాధ్యతను స్వీకరిస్తూ మ్యారేజ్ బ్యూరోను స్థాపించడం విశేషమే కదా! ‘బెస్ట్ ఆఫ్ లక్’ అని ప్రోత్సహిద్దామా మరి!!