జోస్యం ఫలించినపుడు అది చెప్పిన వారి మేథో సంపత్తిని పొగడకుండా ఉండలేం కదా? ఇదీ అటువంటి విషయమే. మార్క్ ఆర్. సలివన్ అనే ఒకాయన దాదాపు 65 ఏళ్ల క్రితం చెప్పిన జోస్యం ప్రసుతం మన కళ్ల ముందు కదలాడడమే కాదు చేతుల్లోనూ వన్నెలు ఒలకబోస్తుండడం విశేషం. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన సలివన్ అప్పట్లో పసిఫిక్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ కంపెనీకి అధ్యక్షునిగా, డైరెక్టర్ గా వ్యవహరిస్తుండేవారు. ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, టెలిఫోన్ భారీ స్థాయిలో అభివద్ధి చెందుతుందని, మానవులు రిస్ట్ వాచ్ మాదిరిగా ఫోన్లను కూడా ధరిస్తారని చెప్పారు. అవతలి వ్యక్తితో మాట్లాడడానికి ఫోన్ ను డయల్ చేయాల్సిన అవసరం కూడా రాదని, బటన్స్ నొక్కే విధానమే ఉండదని కూడా చెప్పారు. అంతేకాదు…అవతలి వ్యక్తిని చూస్తూ మాట్లాడే అవకాశం కూడా ఉండవచ్చని, భాష ఏదైనా మరో భాషలోకి అనువదించే స్థాయికి టెలిఫోన్ దశ చేరుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎంజాయ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ల పనితీరును ఓసారి పరిశీలించండి. సలివన్ 65 ఏళ్ల క్రితం చెప్పిన అంశాలకు ప్రత్యక్ష రుజువుగా ఉన్నాయి కదూ?

సలివన్ జోస్యం దిశ, దశలో భాగంగా టెలిఫోన్ పలు విధాలుగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. తొలిసారి కార్డ్ లెస్ ఫోన్లను 1960వ దశకంలో విడుదల చేశారు. మొబైల్ ఫోన్లకు 1980వ దశకంలో బీజం పడింది. అంతకు ముందు…అంటే 1946లో ఏటీ అండ్ టీ అనే సంస్థ అమెరికాలో తొలి మొబైల్ ఫోన్ కు సంబంధించి కమర్షియల్ ప్రకటన చేసింది. అంతేకాదు నిర్దేశిత సమయంలో, లిమిటెడ్ గా మాత్రమే వినియోగించేందుకు వీలుగా తొలి కమర్షియల్ సబ్ స్క్రిప్షన్ ను కూడా ఏటీ అండ్ టీ సంస్థ ప్రారంభించింది. అప్పట్లో కార్లలో వీటిని బిగించేవారు. దాదాపు 80 పౌండ్ల మొత్తాన్ని వసూలు చేసి వీటిని అందించినట్లు మొబైల్ ఫోన్ల చరిత్ర చెబుతోంది. కాగా టెలిఫోన్ భవిష్యత్ రూపం గురించి సలివన్ చేసిన ప్రసంగపు వార్తా కథనాన్ని అప్పట్లో పత్రికలు కూడా ప్రముఖంగానే ప్రచురించాయట. ఇందులో భాగంగానే 1953 ఏప్రిల్ 11వ తేదీన ‘ది టకోమా న్యూస్ ట్రిబ్యూన్‘ అనే పత్రిక ప్రచురించినట్లు పేర్కొన్న న్యూస్ క్లిప్పింగ్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ సలివన్ చెప్పంది జోస్యమా? అభివృద్ధిని అంచనా వేయడమా? ఏదైనా సలివన్ మేథో సంపత్తి అద్భుతమే కదా?

Comments are closed.

Exit mobile version