బస్తర్ ప్రాంత మీడియాపై మావోయిస్టులు తుపాకీ ఎక్కుపెట్టారు. మీడియా ముసుగులో దళారులుగా అభివర్ణిస్తూ పలు ఆరోపణలు చేస్తున్నారు. ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ ప్రాంత మీడియా ప్రతినిధులను ‘టార్గెట్’ చేస్తూ మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ కమిటీ ఈనెల 9న జారీ చేసిన ఓ పత్రికా ప్రకటన స్థానిక పాత్రికేయుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో నక్సలైట్ల నుంచి బెదిరింపులను చవి చూడడం జర్నలిస్టులకు కొత్త పరిణామమేమీ కాకపోవడం గమనార్హం. బస్తర్ ప్రాంతంలో కొద్ది సంవత్సరాల క్రితం సాయిరెడ్డి అనే జర్నలిస్టుతోపాటు మరో పాత్రికేయున్ని కూడా నక్సలైట్ల హత్య చేశారు. తెలంగాణా ప్రాంతంలో నక్సల్స్ ప్రాబల్యం గల రోజుల్లోనూ స్థానిక జర్నలిస్టులు ఈ తరహా ఇబ్బందులను అనేకంగా చవి చూశారు.
ముఖ్యంగా వరంగల్ నుంచి ఆదిలాబాద్ వరకు అనేక జిల్లాల్లోని పలువురు జర్నలిస్టులు నక్సలైట్ల నుంచి బెదిరింపులను ఎదుర్కున్న ఉదంతాలు కోకొల్లలు. వరంగల్ జిల్లా గోవిందరావుపేటలో పనిచేసిన పలువురు విలేకరులు ప్రతిఘటన నక్సల్ సంస్థ నుంచి పోలీస్ ఇన్ఫార్మర్లు’ అనే ఆరోపణలు ఎదుర్కున్నారు. ఉదయం రిపోర్టర్ శ్రీహరిని ప్రతిఘటన నక్సలైట్లు హన్మకొండలో కిడ్నాప్ చేసి గోవిందరావుపేటకు తీసుకువచ్చి హత్య చేశారు. ఆ తర్వాత పరిణామాల్లో గోవిందరావుకుపేటకు చెందిన పలువురు జర్నలిస్టులు కూడా నక్సలైట్ల నుంచి ఆరోపణలు ఎదుర్కున్నారు. ప్రముఖ జర్నలిస్టుగా ఎదిగిన పర్వతనేని వెంకటకృష్ణతోపాటు కృష్ణారావు అనే విలేకరి కూడా అప్పట్లో ప్రతిఘటన గ్రూపు నక్సల్ సంస్థ నుంచి పలు ఆరోపణలు ఎదుర్కున్నారని, ఈ పరిణామాల్లోనే ఆయా జర్నలిస్టులు గోవిందరావుపేట నుంచి ‘మకాం’ మార్చాల్సి వచ్చిందనే ప్రచారం కూడా ఉంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో ప్రముఖ జర్నలిస్టు మావోయిస్టు నక్సల్స్ కు ‘టార్గెట్’గా మారాల్సి వచ్చింది. సీనియర్ జర్నలిస్టులు, అప్పట్లో కొన్ని యూనియన్ల జోక్యం వల్ల వివిధ ఎన్కౌంటర్ల ఘటనల్లో ఆరోపణలు ఎదుర్కున్న పలువురు జర్నలిస్టులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవలసి వస్తున్నదంటే…?
తెలంగాణా ప్రాంతంలో 1990 దశకం నాటి పరిణామాలు ఇప్పుడు ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ ప్రాంతలో సాక్షాత్కరిస్తుండడం గమనార్హ. మావోయిస్టు నక్సలైట్లు పలువురు జర్నలిస్టులపై ఆరోపణలు చేస్తూ ఓ పత్రికా ప్రకటన జారీ చేశారు. బస్తర్ ప్రాంతానికి చెందిన కొందరు జర్నలిస్టుల పేర్లను ప్రస్తావిస్తూ మావోయిస్టు పార్టీ ప్రకటన జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. పద్దెనిమిది సంవత్సరాలుగా నక్సల్స్ కోటలో విధులు నిర్వహిస్తున్న బీజాపూర్ ప్రాంతానికి చెందిన గణేష్ మిశ్రా, లీలాధర్ రతి, పి. విజయ్, ఫరూఖ్ ఆలీ, శుభ్రాస్తు చౌదరిల పేర్లను ప్రస్తావిస్తూ, వారిపై పలు ఆరోపణలు చేస్తూ మావోయిస్టు నక్సల్స్ ప్రకటన జారీ చేయడం స్థానిక పాత్రికేయుల్లో ఆందోళనను కలిగిస్తోంది. బస్తర్ ప్రాంతంలో వేలాది మంది గ్రామస్తులను వెళ్లగొట్టి, అక్కడ గనులను దోచుకోవడానికి ప్రభుత్వపరంగా కుట్ర జరుగుతోందని, ఇందులో భాగంగానే భద్రతా దళాలు సరికొత్త సంస్థలను మోహరిస్తున్నాయని, కొందరు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఆయా వ్యవహారాల్లో పాలు పంచుకుంటున్నారనేది మావోయిస్టుల ఆరోపణ. అవినీతిపరులను, కార్పొరేట్ సంస్థల బ్రోకర్లను ప్రజాకోర్టులో ప్రజలు తప్పకుండా శిక్షిస్తారనే వ్యాఖ్యలను మావోయిస్టు పార్టీ తన ప్రకటనలో చేసింది.
అయితే మావోయిస్టుల ఆరోపణలను స్థానిక జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నారు. జర్నలిస్టుల కారణంగానే అనేక మంది అమాయకులు నక్సల్స్ చెర నుంచి రక్షించబడ్డారని, కేవలం బస్తర్ లోనేగాక నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలపక్షాన జర్నలిస్టులు నిలబడతారని అంటున్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి అనేక సందర్భాల్లో అమాయకులను రక్షించిన చరిత్ర బస్తర్ ప్రాంత జర్నలిస్టులకు ఉందంటున్నారు. దశాబ్ధాల కాలంగా బస్తర్ ప్రాంతంలో పనిచేస్తున్న శుభస్తు చౌదరి మాట్లాడుతూ, బస్తర్ లో ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని చెబుతున్నారు. తమ గురించి నక్సల్స్ చేసిన ఆరోపణలు బాధను కలిగిస్తున్నాయని గణేష్ మిశ్రా అంటున్నారు. నక్సల్స్ ఆరోపణలకు గురైన పలువురు జర్నలిస్టులు బీజాపూర్ లో ఇప్పటికీ అద్దె ఇళ్లల్లో నివాసముంటున్నారని, నక్సలైట్ల లేఖ విచారకరమని స్థానిక పాత్రికేయ వర్గాలు చెబుతున్నాయి. కాగా మావోయిస్టులు జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ జారీ చేసిన ప్రకటనపై విచారణ జరుపుతున్నట్లు బస్తర్ ఐజీ పి. సుందర్ రాజ్ చెప్పారు. తాము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, జర్నలిస్టుల, సామాజిక కార్యకర్తలు సహా పౌరులందరి బాధ్యత పోలీసులదేనని, తాము వారికి రక్షణ కల్పిస్తామని చెప్పారు.