ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో వెలసిన మావోమయిస్టు నక్సలైట్ల పోస్టర్లు స్థానికంగా కలకలానికి దారి తీశాయి. మండలంలోని షాపల్లి గ్రామంలో మావోయిస్టుల పేరిట గోడలకు పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు పోలీసు బలగాలతొ అడవులను జల్లడ పట్టడం ఆపాలని ఆయ పోస్టర్లలో డిమాండ్ చేశారు.
అదేవిధంగా కూంబింగ్స్ ఆపకుంటే టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు అధికార పార్టీ నాయకుడు భీమేశ్వరరావుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఓ మాజీ మావోయిస్టు తన బొలెరో వాహనంలో పోలీసులను తిప్పడం పద్ధతి కాదని, ప్రజల చేతుల్లో శిక్ష తప్పదని హెచ్చరించారు. అంతేగాక ముగ్గురు ఫారెస్ట్ అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ, వాళ్లేగాక చాలా మంది పద్ధతి మార్చుకోవాలన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం పేరుతో చేసేదేమీ లేదని, ప్రజలు సమస్యలు అడిగితే అక్రమ అరెస్టులు చేయిస్తున్నాడని, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పెంచుతూ ప్రజలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయా పోస్టర్లలో ఆరోపించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాకకు చెందిన భీమేశ్వరరావును నక్సల్స్ హత్య చేసిన ఘటనను మరువకముందే ఏటూరునాగారం-భూపాలపల్లి కమిటీ పేరుతో వాల్ పోస్టర్లు అంటించడం గమనార్హం.