తెలంగాణాలో నక్సలైట్లు లేరు… ఉనికిని చాటేందుకు మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ నుంచి అప్పుడప్పుడు గోదావరి నది దాటి వచ్చి పోతుంటారు… అంతే తప్ప ప్రత్యేక రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలు లేవు. పూర్తి స్థాయిలో నక్సల్స్ ను నియంత్రించాం… నిలువరించాం… పోలీసు అధికారులు అనేక సందర్భాల్లో వెల్లడించిన అంశమిది. కానీ గత కొంత కాలంగా గోదావరి పరీవాహక ప్రాంతంలో మావోయిస్టు నక్సల్ నేతల పేర్లతో లేఖలు విడుదలవుతున్నాయి. మొన్న ములుగు జెడ్పీ చైర్మెన్ జగదీష్ పై, ఆ తర్వాత వెంకటాపూర్ కు చెందిన అధికార పార్టీ నేతలపై, తాజాగా వరంగల్ నగరంలోని పలువురు టీఆర్ఎస్ నేతలను హెచ్చరిస్తూ విడుదలైన లేఖలు తీవ్ర కలకలం సష్టిస్తున్నాయి. తనపై చేసిన ఆరోపణలను ఏటూరునాగారం ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని మావోయిస్టు నేత సబితకు ములుగు జెడ్పీ చైర్మెన్ జగదీష్ విసిరిన సవాల్ కు ఇప్పటి వరకు సమాధానం లేదు. వెంకటాపురం-వాజేడు ఏరియా కార్యదర్శి సుధాకర్ పేరుతో విడుదలైన లేఖపై ఆరోపణలు ఎదుర్కొన్న నేతలు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే వరంగల్ నగరానికి చెందిన అనేక మంది అధికార పార్టీ నేతలను హెచ్చరిస్తూ మావోయిస్టు నక్సల్స్ పేరుతో తాజాగా విడుదలైన లేఖ తీవ్ర చర్చకు దారి తీసింది.
తెలంగాణా రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో, వెంకటాపూర్, ఏటూరునాగారం ఏరియా కార్యదర్శులు సుధాకర్, సబితల పేర్లతో గతంలో విడుదలైన లేఖలకు, తాజాగా జయశంకర్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో విడుదలైన లేఖకు మధ్య అనేక తేడాలు ఉండడమే ఇందుకు కారణం. వెంకటేష్ పేరుతో వెలువడిన లేఖ రూపు రేఖలపైనే అనేక అనుమానాలు కూడా కలుగుతున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా లేఖలో వాడిన భాష, పదాల కూర్పు, భాషా దోషాలు సైతం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయనే వాదన వినిపిస్తోంది.
దశాబ్దాల మావోయిస్టు కార్యకలాపాల చరిత్రలో నాలుగు జిల్లాలను కలుపుతూ ఓ కమిటీ ఉన్న దాఖలా లేకపోవడం కూడా గమనార్హం. ఈ కమిటీ వాస్తవమైతే ఆయా జిల్లాల పోలీసులు సైతం కలవరపడాల్సిన అంశంగానే ఇంటలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేగాక ఈ లేఖలో దాదాపు పది వరకు భాషా పరంగా సహజ పొరపాట్లు కాకుండా ఘోర తప్పిదాలు (బ్లండర్స్) కూడా ఉన్నాయి. మావోయిస్టుల పేరుతో ఇన్ని తప్పులతో లేఖలు విడుదలైన ఉదంతాలు గతంలో లేకపోవడం గమనార్హం. లేఖ ముగింపు కూడా మావోయిస్టు నక్సల్స్ పరిభాషలో లేకపోవడం ప్రస్తావనార్హం. అంతేగాక తాజా లేఖలో నక్సల్స్ జెండా కూడా లేదని పోలీసు వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ‘రియల్ ఎస్టేట్’ దందాకు సంబంధించిన అంశం చుట్టూరా లేఖలోని ఆరోపణలు పరిభ్రమించడం కూడా అనేక అనుమానాలకు తావు కల్పిస్తున్నట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. గతంలో విడుదలైన కొన్ని లేఖలను, తాజా లేఖలను ఎగువన, దిగువన పరిశీలిస్తే లేఖ నకిలీదా? అసలుదా? అనే సంశయాలు కలగడం ఖాయం.