మావోయిస్టు పార్టీకి చెందిన ఐదుగురు మిలీషియా సభ్యులను అరెస్ట్ చేసినట్లు భద్రాచలం పోలీసులు మంగళవారం ప్రకటించారు. ఈమేరకు భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర ఓ ప్రకటన విడుదల చేశారు. నిన్న మధ్యాహ్నం చర్ల ఎస్ఐ,స్పెషల్ పార్టీ పోలీసులు, 141 (ఏ) సిఆర్పిఎఫ్ సిబ్బందితో కలిసి చర్ల పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వీరు పట్టుబడినట్లు చెప్పారు. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద పూసుగుప్పకు వెళ్లే రహదారి వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఐదుగురు వ్యక్తులను పట్టుకుని విచారించగా, వారు చత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన కోరం జోగా,పొడియం జోగా, బాడిస లక్ష్మా, సోడి లక్మ,కొర్స సురేశ్ అనే వ్యక్తులుగా తేలిందన్నారు.
ఆయా వ్యక్తులు గత నాలుగేళ్లుగా నిషేధిత మావోయిస్టు జేగురుగొండ ఏరియా కమిటీ జగదీష్, నాగమణి అనే మావోయిస్టు సభ్యులకు కొరియర్లుగా, సానుభూతిపరులుగా ఉంటూ లోకల్ మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నారని విచారణలో తెలిసిందన్నారు. ఆయా మావోయిస్టు సభ్యుల ఆదేశాల మేరకు ఈ ఐదుగురు వ్యక్తులు భద్రాచలం పట్టణం నుండి మావోయిస్టు పార్టీ యూనిఫామ్ క్లాత్ కొనుక్కొని తిరిగి వెళ్తుండగా చర్ల లోని గాంధీ బొమ్మ సెంటర్ లో చర్ల పోలీసులు పట్టుకున్నట్లు చెప్పారు. వీరి వద్ద నుండి 20 మీటర్ల ఆలివ్ గ్రీన్ క్లాత్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
నిషేధిత మావోయిస్టు పార్టీ నాయకులు పూర్తిగా అమాయకులైన ఛత్తీస్ గఢ్ రాష్ట్ర గిరిజనులను తెలంగాణ ప్రాంతానికి పంపిస్తూ వారితో పార్టీకి అవసరమైన వస్తు సామాగ్రిని, పేలుడు పదార్దాలను తెప్పించుకుంటూ వారికి అవసరమైన పనులను చేయించుకుంటున్నారని అన్నారు. అదేవిధంగా తెలంగాణ మావోయిస్ట్ స్టేట్ కమిటీ, బెటాలియన్ యాక్షన్ టీమ్ లను, రెక్కి టీమ్ లను తెలంగాణలోకి పంపిస్తూ పోలీసుల కదలికలను గమనించి పలు హింసాత్మక చర్యలు సృష్టించి ప్రజలను భయాందోళనలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఏఎస్పీ రాజేష్ చంద్ర వివరించారు. ప్రజలు ఎవరూ కూడా మావోయిస్టు పార్టీ నాయకులకు సహకరించవద్దని, వారికి ఎటువంటి వస్తువులను సరఫరా చేయవద్దని పోలీసుశాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.