తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 68వ పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి, ప్రధాని, ఉప ప్రధాని మొదలుకొని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా తమ శుభాకాంక్షలను తెలిపారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసిన ఉద్యమకారుడు కేసీఆర్ అని, అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిన పరిపాలనాదక్షుడని వారు కొనియాడారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, తను ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలని వారు ఆకాంక్షించారు.
అదే విధంగా తెలంగాణతోపాటు, మనదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని, ఇతర దేశాల్లోని కేసీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ జన్మదినాన్ని అంగరంగ వైభవంగా, పండుగ వాతావరణంలో నిర్వహించారు. రక్తదానం, అన్నదానం, పేదలకు, వృద్ధులకు, అంధులకు సాయం అందించే పలు వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ తమ అభిమాన నాయకుడు ఆరోగ్యంగా ఉండాలని కాంక్షించారు. సీఎం కేసీఆర్ జీవిత చరిత్రలను తెలియజేసే విధంగా పలు డాక్యుమెంటరీలు విడుదలయ్యాయి. ప్రముఖ రచయితలు వ్యాసాల ద్వారా, కవులు తమ పాటలు, కవితలు, ప్రకటనల ద్వారా సీఎం కేసీఆర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అనేక పాటలు విడుదలయ్యాయి. సీఎం కేసీఆర్ కు బర్త్ డే విషెష్ తెలిపినవారి వివరాలు ఇలా ఉన్నాయి.
• రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సీఎం కేసీఆర్కు ఫోన్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
• ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి సీఎం కేసీఆర్ కు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. తమ ట్విట్టర్ ద్వారా.. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు. చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్ధిస్తున్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
• సీఎం కేసీఆర్ కు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు లేఖ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘భగవంతుడు మీకు దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. సమాజ హితం కోసం మీరు చేపట్టే కార్యక్రమాల ద్వారా మీ జీవితం కీర్తిమయం, సార్ధకం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ముఖ్యంగా తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమైనవి. ప్రజాసేవకు అంకితమై ముందుకు సాగుతున్న మీ జీవితంలో సుఖశాంతులు నిండాలని కోరుకుంటున్నాను’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
• సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
• ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూల బోకేను పంపారు.
• సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో, చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
• తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కూడా సీఎం కేసీఆర్కు ఫోన్లో శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రాల హక్కులు, స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతున్న నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. రాజ్యాంగం ద్వారా కల్పించిన రాష్ట్రాల హోదాను, సమాఖ్య స్ఫూర్తిని కాపాడుకోవడానికి, హక్కులను పరిరక్షించుకోవడానికి అందరం కలిసి పనిచేద్దామని స్టాలిన్ ట్వీట్ చేశారు.
• అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.. సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ కు ఆ తల్లి కామాఖ్య, మహాపురుష్ శ్రీమంత సంకరదేవుని ఆశీస్సులు ఉండాలని వేడుకుంటూ ట్వీట్ చేశారు.
• కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
• ప్రముఖ సినీనటుడు, మాజీ ఎంపీ చిరంజీవి సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వుండాలని, మీ లక్ష్య సాధనకి, ప్రజాసేవకి మీకు ఆ భగవంతుడు అపరిమిత శక్తి సాముర్థ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
• తెలంగాణ మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
• సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు.
• కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు ట్విట్టర్ ద్వారా సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
• సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. ‘మీరు నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు.
• భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయురారోగ్యాలతో కలకాలం వర్దిల్లేలా సీఎం కేసీఆర్ ను ఆ దేవుడు దీవించాలని కోమటిరెడ్డి ఆకాంక్షిస్తూ, ట్వీట్ చేశారు.
• అలాగే, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
• జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్… సీఎం కేసిఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
• రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, చంద్రబాబు తనయుడు ఎమ్మెల్సీ నారా లోకేశ్, ఏపీ ఎమ్మెల్యే, సినీనటి రోజా, సినీ నటులు నాగార్జున, మహేశ్ బాబు, నితిన్, ఎన్.టి.వి. చైర్మన్ నరేంద్ర చౌదరి తదితరులు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కు సామాజిక మాధ్యమాల్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
• హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయెల్ రీఫ్ మాన్ సీఎం కేసీఆర్ కు ట్వీట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అమెరికాతో సంబంధాలను మరింత పటిష్టపరిచేందుకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
• హైదరాబాద్ లోని బ్రిటన్ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. యూకే – తెలంగాణ మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు