కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరనే అంశంపై తెలంగాణా కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ… ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ చేసిన ప్రకటన ఆసక్తికరం. ఇంతకీ మాణిక్కం సార్ ఏమంటున్నారో తెలుసా…? తెలంగాణా పీసీసీకి కొత్త అధ్యక్షున్ని ఎంపిక చేసి ప్రకటించడానికి మరికొంత సమయం పడుతుందట. ఎందుకంటే… ఇందుకు మరింత కసరత్తు చేయాల్సి ఉందట. హైదరాబాద్ లో ఏఐసీసీ, కోర్ కమిటీ సభ్యులు, తాజా, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులతో మాట్లాడామని, మొత్తం 162 మంది అభిప్రాయాలను సేకరించామని ఠాగూర్ చెప్పారు. ఆయా నాయకుల నుంచి తీసుకున్న అభిప్రాయాలను సోనియాగాంధీకి పంపించామని, సంప్రదింపుల ప్రక్రియ పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుందని, ఇందుకు గడువు కూడా ఏమీ లేదని మాణిక్యం ఠాగూర్ సెలవిచ్చారు.
‘‘నిజమే… టీపీసీసీ అధ్యక్షుని నియామకానికి ఇప్పుడు అర్జంటుగా వచ్చిన తొందరేమీ లేదు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండేళ్ల గడువు కూడా పూర్తయింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ లో తన భార్యను కూడా గెలిపించుకోలేకపోయారు. దుబ్బాక ఎన్నికల్లో ‘హస్తం’ స్థితి అడుగు ముందుకు పడిన దాఖలా లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అవే రెండు డివిజన్ల గెలుపు దిక్కయింది. రేపో, మాపో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కూడా జరుగుతుంది. ఆ జానారెడ్డి పార్టీలోనే ఉంటారో, ప్రత్యర్థి పార్టీలవైపు చూస్తున్నారో తెలియని అయెమయ స్థితి. ‘సాగర్’ ఉప ఎన్నికే కాదు వరంగల్, సిద్ధిపేట, ఖమ్మం నగరాలకు మున్సిపల్ ఎన్నికలు కూడా త్వరలోనే జరగొచ్చు. ఇక్కడా పార్టీ పరిస్థితి ఏమిటో బోధపడడం లేదు. అయినా వరుస పరాజయ ఫలితాల నేపథ్యంలో… ఇప్పటికిప్పుడు పీసీసీ అధ్యక్ష పదవిని ఎవరో ఒకరికి ఇచ్చినా, పదవిని ఆశించిన మరికొందరు నాయకులు పార్టీని విడిచిపెట్టవచ్చు. ఈ పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్షుని ఎంపికకు వచ్చిన తొందరేమీ లేదు. ఎలాగూ జమిలి ఎన్నికలంటున్నారు. అది సాధ్యం కాకపోతే తెలంగాణా అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్ల వ్యవధి మాత్రమే ఉంది. అందువల్ల ఇప్పటికిప్పుడు వచ్చిన తొందరేమీ లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగిశాక పీసీసీ అధ్యక్షుని ఎంపిక ఎంచక్కా.., తాపీగా చేసుకోవచ్చు.’’ అని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మాణిక్కం సార్… అర్థమవుతున్నదా… కాంగ్రెస్ శ్రేణుల భావన!