కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృత నేత పాడి కౌశిక్ రెడ్డికి ఆ పార్టీ తెలంగాణా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీసు పంపించారు. కౌశిక్ రెడ్డి నిన్న మాణిక్కం ఠాగూర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 50 కోట్లు తీసుకుని రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇప్పించారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాలపై మాణిక్కం ఠాగూర్ నిన్ననే స్పందించారు. మధురై కోర్టుకు ఇటువంటి ఆరోపణలు చేసే నాయకులకు స్వాగతం పలుకుతున్నట్లు ఠాగూర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఇప్పటికే లీగల్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. రూ. 25 కోట్లు తీసుకుని రేవంత్ పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారని సుధీర్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఈ నోటీసును పంపించారు.
ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి కూడా మాణిక్కం ఠాగూర్ పై ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడం తన ప్రాథమిక కర్తవ్యమని, అందువల్లే సీఎం కేసీఆర్ కు విధేయులైన వారు ఎప్పుడూ తనపై ఆరోపణలు చేస్తారని నిన్న మాణిక్కం ఠాగూర్ వ్యాఖ్యానించారు. తన న్యాయవాదులు కౌశిక్ రెడ్డికి పరువు నష్టం నోటీసులు జారీ చేస్తారని కూడా ఆయన నిన్ననే ప్రకటించారు. మధురైలో ఫిర్యాదు నమోదు అవుతుందని, తనపై ఆరోపణలు చేసిన వారికి మధురై కోర్టుకు స్వాగతం పలుకుతున్నట్లు కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డికి మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీసు పంపడం గమనార్హం.