ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రేసులో అనూహ్యంగా మరో నాయకుడు దూసుకువచ్చారా? ఇదే నిజమైతే పార్టీ టికెట్ ను ఆశిస్తున్న స్థానిక నాయకులతోపాటు జిల్లాతో అంతో ఇంతో అనుబంధం గల నాయకుల పరిస్థితి ఏమిటి? ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో తొలుస్తున్న ప్రశ్న ఇది. ఖమ్మం ఎంపీ అభ్యర్థి రేసులోకి నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు పేరు తాజాగా చర్చల్లోకి రావడమే ఇందుకు ప్రధాన కారణం.
రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ స్థానాల్లో 14 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ఇప్పటికే ఖరారు చేసినప్పటికీ, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లపై అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీ ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది. వరంగల్ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురాంరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డిలు మాత్రమే చివరికి రేసులో మిగిలారనే ప్రచారం ఉండనే ఉంది. అయితే ఈ అంశంలో భిన్నకథనాలు వ్యాప్తిలోకి వచ్చిన పరిణామాల్లోనే తాజాగా మరో అంశం మీడియాలో చక్కర్లు కొడుతుండడం విశేషం. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వర్ రావు పేరు మీడియా కథనాల్లో ప్రాచుర్యంలోకి రావడం గమనార్హం.
ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా స్థానికేతరులను ఖరారు చేయడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాకపోవడం ప్రస్తావనార్హం. పీవీ రంగయ్యనాయుడు, నాదెండ్ల భాస్కర్ రావు, రేణుకా చౌదరి తదితరులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఖమ్మం నుంచి స్థానికేతరులుగానే గెలుపొందారు. స్థానికేతరులు పార్టీ టికెట్లు దక్కించుకుని ఇక్కడ ఎంపీగా విజయం సాధించడం వెనుక పటిష్టమైన కాంగ్రెస్ ఓటు బ్యాంకు కారణమనే అంశం బహిరంగమే.
అయితే డిప్యూటీ సీఎం సహా ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు మల్లు నందిని, పొంగులేటి ప్రసాదరెడ్డి, తుమ్మల యుగంధర్ లతోపాటు వి. హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్, వీవీసీ రాజేంద్రప్రసాద్ వంటి పలువురు నాయకులు కాంగ్రెస్ టికెట్ కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే మండవ వెంకటేశ్వర్ రావు పేరు తెరపైకి రావడం గమనార్హం. మండవ వెంకటేశ్వర్ రావు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు సన్నిహిత మిత్రుడని కూడా కాంగ్రెస్ వర్గాలు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తుమ్మల నాగేశ్వర్ రావు, మండవ వెంకటేశ్వర్ రావు, కోడెల శివప్రసాదరావు, బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డిలు మంచి మిత్రులుగా ప్రాచుర్యం పొందారు. ఖమ్మం టికెట్ రేసులోకి మండవ వెంకటేశ్వర్ రావు వచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వర్గీయుల్లో రెండు, మూడు రోజుల క్రితం నుంచే చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా మండవ వెంకటేశ్వర్ రావు పేరు తాజాగా తెరపైకి రావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో భిన్న చర్చలు జరుగుతున్నాయి. మండవ వెంకటేశ్వర్ రావు పేరును తెరపైకి తీసుకురావడంలో రాజకీయ వ్యూహమేంటి? ఆయనను ఇక్కడకు తీసుకురావడంలో అసలు ఆంతర్యమేమిటనేది కాంగ్రెస్ వర్గీయుల్లో జరుగుతున్న చర్చల సారాంశం. ఇదిలా ఉండగా రంజాన్ పర్వదినం మరుసటి రోజు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనేది తేలుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.