తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధి కామ్రేడ్ శ్రీమతి మల్లు స్వరాజ్యం శనివారం తుదిశ్వాస విడిచారు.
గత కొద్దిరోజులుగా స్వరాజ్యం అనారోగ్యంతో చికిత్సపొందుతున్న విషయం తెలిసిందే. ప్రజా ఉద్యమానికి ఆమె మృతి తీరనిలోటు.
స్వరాజ్యంతో ప్రత్యక్ష భాగస్వామ్య సంఘటనలు నాకేం లేనప్పటికీ మరిచిపోలేని ఓ చిరు జ్ఞాపకం మాత్రం ఉంది. ఈ సందర్భంగా నా జ్ఞాపకాలల్లో నిక్షిప్తమైన ఈ చిన్న అంశం పంచుకునే ప్రయత్నమిది. దీనికి ఇదే సరైన సమయమనిపించిందీ!
తారీఖులూ, సంవత్సరాలు గుర్తులేవూగానీ, నా పుట్టిన గ్రామం గొట్టిపర్తిలో పాఠశాల స్థాయి విద్యార్థిగా ఉన్న కాలం. అది ఎన్నికల సమయమనేది మాత్రం గుర్తుంది. ఎందుకంటే మా ఊరికి ఎన్నికలొచ్చాయంటే వివిధ పార్టీల జెండాలు, పాటలతో జీపుల్లో ప్రచారానికి వచ్చేవారు. ఆ జీపుల వెనుక ఉరికిన అనుభవం,కరపత్రాలు తెచ్చుకున్న అలవాటు ఉంది. అప్పుడు మూడు రంగుల జెండా, ఎర్రజెండాల ప్రచారం ఎక్కువ కనిపించేది. పెద్ద గ్రామం కావడం వల్ల పార్టీల నాయకులు దృష్టికేంద్రీకరించేవారు.
అదే మాదిరి ఆ రోజు పొద్దంతా జీపుల్లో పాటలు పాడుతూ ఎర్రజెండా పార్టీ ఊరంతా ప్రచారం చేశారు. సాయంత్రం మా ఊరి నడిబొడ్డున ఏటికాల్వ దగ్గర సెంటర్లో సభ పెట్టారు. సభకు ముందు మైకుల్లో పాటల ద్వారా ప్రచారం చేశారు. సభకు సందర్భంగా ఊర్లో ఎర్రజెండాలతో భారీ ఊరేగింపు చేశారు. నినాదాలతో హోరెత్తించారు. అప్పట్లో అది ఆకర్షణీయంగా అనిపించింది. ఇక సభలో మహిళా గాయకులు పాడిన పాటలు ఎంతో ఆకట్టుకున్నాయి.
ఈ సభలో కామ్రేడ్ మల్లు స్వరాజ్యం ఉపన్యసించారు. గంభీరమైన కంచుకంఠం, ఏ మాత్రం తొణకకుండా మాట్లడిన తీరు ఆ వయస్సులో నాకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఆమె మహిళకావడంతోపాటు కాసింత బెరుకులేకుండా దొరల పెత్తందారీ పద్దతి పై బల్లగుద్దినట్లు మాట్లాడడం అందరీ ఆకట్టుకున్నదీ.
ఆమె మాటల్లోని అర్థం తెలిసే వయస్సు నాది కాదు. ఆ చిత్రం నాలో ముద్రవేయబడిందీ. నేను విన్న తొలి రాజకీయ ఉపన్యాసం ఆమెది కావడం విశేషం.
తర్వాత కాలంలో ఆమె మా నియోజకవర్గమైన తుంగతుర్తి ఎమ్మెల్యేగా గెలిచి పనిచేసినట్లు గ్రహించాను. మా ఊళ్ళో పెట్టిన ఆ సభ కూడా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిందనీ అర్థం చేసుకున్నాను. ఆ ఎన్నికల్లో ఆమే స్వయంగా పోటీచేసినట్లు తెలుసుకున్నాను.
ఒక విధంగా నేను విన్న తొలి రాజకీయ, కమ్యూనిస్టు ఉపన్యాసం అమరులు స్వరాజ్యందే కావడం యాదృచ్చికం.
తర్వాత కాలంలో వారి స్వగ్రామం తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడమనీ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, కుశలవరెడ్డి తన సోదరులని తెలిసిందీ. సీఎల్సీలో పనిచేసిన రత్నమాల ఆ కుటుంబమేనని తర్వాత తెలిసిన విషయాలు.
మా సహచరుడు, అమరుడు మారోజు వీరన్నది కూడా అదే గ్రామం కావడంతో ఆ ఊరికి రెండు,మూడు పర్యాయాలు వెళ్ళాను. అందుకే స్వరాజ్యం పేరు వినగానే నాకు నా చిన్నప్పటి ఎన్నికల ప్రచార సభ గుర్తుకొస్తుందీ. ఆమె భారీ విగ్రహం యాదికొస్తుందీ. తర్వాత కాలంలో ఎన్నోసార్లు ఆమె ఉపన్యాసాలు విన్నాను.
ఆమె ప్రాతినిధ్యం వహించిన సీపీఎం రాజకీయాలతో నాకు సంబంధంలేకపోయినా స్వరాజ్యం, భీంరెడ్డి అంటే ఎందుకో గౌరవ భావం ఏర్పడింది. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నవారు కావడం వల్ల కావచ్చేమో!
ప్రస్తుతం అమె సీపీఎం నేతగా ఉన్నప్పటికీ అమె తొలితరం కమ్యూనిస్టునేతల్లో ఒకరుగా ప్రత్యేక గుర్తింపు ఉంది. సుదీర్ఘ పోరాట చరిత్ర ఆమె సొంతం. అగ్రకుల,భూస్వామ్య, మూలాల నుంచి వచ్చినా అణగారిన వర్గాల విముక్తిపోరాటంలో ఆమె త్యాగనిరతితో పనిచేశారు. అంకితభావం కలిగిన కమ్యూనిష్టు నేతగా, మహిళానేతగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. స్వరాజ్యం గురించి చెప్పాలంటే ఎంతో చరిత్ర ఉంది. అదంతా చెప్పడం నా రైటప్ ఉద్దేశ్యం కాదు.
కామ్రేడ్ మల్లు స్వరాజ్యం అమర్హై!
✍️ రవి®సంగోజు