దివంగత ప్రధాని ఇందిరాగాంధీ విధాన ప్రకటన సూత్రాన్ని మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు గుర్తుకు తీసుకువస్తున్నాయా? అవునంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ వ్యవహరించిన కాలంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక రాతలు ఆమెకు అస్సలు నచ్చేవి కావు. ఆ పత్రిక యజమాని రామ్ నాథ్ గోయెంకా గురించి ts29.in ఇటీవల పబ్లిష్ చేసిన కథనం చదివారు కదా? ఇందిరాగాంధీ విధానాలను ఎక్స్ ప్రెస్ పత్రిక తూర్పార బట్టేది. విమర్శనాత్మక సంపాదకీయాలు కోకొల్లలుగా ప్రచురించేది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర తాజా రాజకీయాలను ఇందిరాగాంధీ విధానాలతో అన్వయిస్తూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటో యథాతథంగా మీరూ చదవండి…
‘‘అప్పట్లో ఇందిరాగాంధీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీసీ అలెగ్జాండర్. ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రింటింగ్ రాత్రి ఎన్ని గంటలకు క్లోజ్ అవుతుందని ఒకసారి ఇందిరాగాంధీ ఆయన్ను అడిగారట. రాత్రి ఒంటిగంటకు అని ఆయన చెప్పారట. అయితే మన నిర్ణయాన్ని రాత్రి రెండు గంటల తర్వాత ప్రకటించండని ఆమె ఆదేశించారట. ఉదయం రేడియోలో విన్నవాళ్ళకు మాత్రమే ఆమె నిర్ణయాలు తెలిసేవి. తీరుబడిగా దినపత్రికల్లో చదవాలంటే మరుసటి రోజు వరకు ఆగాల్సిందే. ఈ లోపు కాగల కార్యాన్ని గంధర్వులు నిర్వహించేస్తారన్న మాట.
ఆర్టీసీ కండక్టర్ నుంచి ఆరణాల కూలీ వరకు తను అనుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఇందిరాగాంధీ కూర్చోబెట్టేవారు. వాళ్ళు కాకూడదా అని ప్రశ్నించకండేం…! వరదయ్య కురుపయ్య(వీకే) మూపనార్ ఇలాంటి పనులను నెరవేర్చడంలో సిద్ధహస్తుడంట. అందుకే ఆయన చనిపోయినప్పుడు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఒకటి ‘కాంగ్రెస్ క్రైసిస్ మేనేజర్ నో మోర్’ అని హెడ్డింగ్ పెట్టింది. ఏకంగా సంపాదకీయం కూడా రాసింది. ప్రజాబలం ఉన్న నాయకులను ఆమె బతకనిచ్చేవారు కాదని అంటుంటారు.
రోజంతా ఛానళ్ళ ప్రసారాల రోజుల్లోనూ ఇలాంటి వేషాలు కుదురుతాయా అని అనుకునేవాడిని. మహారాష్ట్రలో తాజా పరిణామం అందుకు చక్కని ఉదాహరణ. నేను దినపత్రిక చూసేటప్పటికి ఇంకా చర్చలే జరుగుతున్నట్టు సమాచారం ఉంది. టీ తాగి సెల్ చూస్తే, ప్రమాణస్వీకారం కూడా పూర్తయింది. అబ్బా ఎంత ప్రగతి! ఇందిరమ్మను తలదన్నేవాడు పుడతాడా అనుకున్నా… ఈ రోజుతో ఆ లోటు తీరిపోయింది. శబాష్ ఛాయ్ వాలా!
విచిత్రం ఏమిటంటే ఈ రోజుల్లో సీఎంలనుంచి పీఎం వరకు వారు అనుకున్నది జరిగే వెసులుబాటు ఉంది. తమ మాటే ఫైనల్. సీతయ్యలు ఎవరి మాటా వినరు సుమా!’’ అదన్న మాట సంగతి.