‘శివసేన మోసం చేసింది. ప్రజా తీర్పు బీజేపీకే అనుకూలంగా వచ్చింది. మాకు సంఖ్యా బలం లేదు. అజిత్ పవార్ చేయూతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఆయన వెళ్లిపోవడంతో మాకు సంఖ్యా బలం లేదు. నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా. ప్రతిపక్షంలో కూర్చుంటాం. ప్రజావాణిని వినిపిస్తాం.’
మహారాష్ట రాజకీయాల్లో తాజా మలుపులివి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 80 గంటలైనా పూర్తి కాకముందే ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేయాల్సిన అనివార్య పరిణామాలు. బీజేపీ అంచనాలు పటాపంచలు. ఆసరాగా ఉంటారని భావించిన అజిత్ పవార్ మధ్యలోనే బాబాయ్ శరద్ పవార్ వైపు మెగ్గు. వెరసి మరాఠా రాజకీయం మహా రసవత్తరం. రామ్ గోపాల్ వర్మకు అప్పగిస్తే మాంచి మసాలా సినిమాకు కావలసినంత రాజకీయ సరుకు.
తెల్లవారితే శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీతోపాటు ఎన్సీపీ, కాంగ్రెస్ అగ్రనేతలు ప్రకటించి, అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలోనే గత శుక్రవారం అర్థరాత్రి మహారాష్ట రాజకీయాలు కీలక మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. అత్యవసరంగా రాష్ట్రపతి పాలన ఎత్తివేత, వెనువెంటనే సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం శనివారం ఉదయం కల్లా జరిగిపోయాయి. ఈ హఠాత్పరిణామం నుంచి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు తేరుకునేలోపే అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన అన్నకొడుకు అజిత్ పవార్ చేసిన ఘనకార్యంపై ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ పెద్దగా కంగారుపడిన దృశ్యాలేమీ కనిపించలేదు. కొందరు కాంగ్రెస్ నేతలు ‘ పవార్… నువ్వు మహా గొప్పోడివయ్యా’ అంటూ దెప్పి పొడిచినా పట్టించుకోలేదు. వ్యూహాత్మకంగా శరద్ పవార్ పావులు కదిపారు. అజిత్ పవార్ ను శాసనసభా పక్ష నేతగా తొలగించారు. ఈలోగా వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. వాద, ప్రతివాదనల అనంతరం బుధవారం సాయంత్రం అయిదు గంటల్లోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఈరోజు ఉదయమే తీర్పు చెప్పింది. అత్యంత సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకోవాలని, బలపరీక్ష మొత్తం వీడియో తీయడంతోపాటు ప్రత్యక్ష ప్రసారం చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. బలపరీక్షలో గెలుపుపై ఆయా పార్టీలు పరస్పర ధీమాను వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీలకు చెందిన అగ్ర నేతలు తమ ఎమ్మెల్యేలతో సోమవారం రాత్రే ముంబయ్ హోటల్లో పరేడ్ నిర్వహించి సంఖ్యా బలాన్ని ప్రదర్శించారు.
కానీ మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ అనూహ్య మలుపులు. బాబాయ్ శరద్ పవార్ కు జెల్ల కొట్టి బీజేపీ పంచన చేరి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్ మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తన పదవికి రాజీనామా చేశారు. శరద్ పవార్ సతీమణి, అల్లుడు నెరపిన రాజకీయ మంత్రాంగానికి ముగ్ధుడై అజిత్ పవార్ తన మనసు మార్చుకున్నట్లు వార్తలు. ఇంకేముంది మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పావులు కదిపే పరిణామాలు పూర్తిగా సన్నగిల్లాయి. బల పరీక్ష గురించి ఆలోచించే అవకాశమే లేకుండా పోయింది. మొత్తం 105 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ అజిత్ పవార్ వెంట కనీసం 30 మంది ఎమ్మెల్యెలైనా ఉండకపోతారా? అని అంచనా వేసింది. కానీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాయకుడే ప్లేట్ ఫిరాయిస్తే చేసేదేముంది? ఏమిలేకనే ఫడ్నవీస్ మధ్యాహ్నం 3.30 గంటలకు మీడియా ముందుకు వచ్చారు. అటు శివసేనను, ఇటు ఎన్సీపీని, ఇంకోవైపు కాంగ్రెస్ ను దుమ్మెత్తిపోశారు. వారి కలయిక ఎంతో కాలం నిలవదని శపించారు. తమకు సంఖ్యా బలం లేదనే వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా అంగీకరించారు.
ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ప్రజలు స్పష్టమైన ఆధిక్యతను ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం కాగా, అధికారం కోసం శివసేన బేరసారాలు మొదలు పెట్టింది. శివసేనకు మేం ఎటువంటి హామీలు ఇవ్వలేదు. ఎమ్మెల్యేలను చీల్చలేనని, బేరసారాలకు పాల్పడలేనని అజిత్ పవార్ కూడా చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో బలపరీక్షలో నెగ్గేందుకు మా దగ్గర సంఖ్యాబలం సరిపడా లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం. అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు రాజీనామా పత్రం సమర్పిస్తా. ప్రతిపక్షంలో కూర్చుంటాం. ప్రజావాణి వినిపిస్తాం’ అని ఫడ్నవీస్ మీడియా సమావేశంలో ప్రకటించారు.
మొత్తంగా బలపరీక్షకు ముందే బీజేపీ ఎత్తుగడలు చిత్తయ్యాయి. ఇప్పటికైనా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి అధికారం చేపట్టేందుకు మార్గం సుగమమైనట్లేనా? ‘మహా’ రాజకీయాల్లో మళ్లీ ఏవేని అనూహ్య మలుపులు చోటు చేసుకుంటాయా? చూడాలి మరి.