మన తెలుగు రాష్ట్రాల ప్రజలు కరోనా వైరస్ గురించి పెద్దగా భయపడుతున్నట్లు కనిపించడం లేదు. దాని తీవ్రత కూడా బోధపడుతున్నట్లు లేదు. అందుకే కాబోలు కనీస భౌతిక దూరం కూడా పాటించకుండా, మూతికి మాస్క్ కూడా లేకుండా అనేక మంది విచ్చల విడిగా బజార్లలో తిరుగుతున్నారు. కానీ కరోనా కరాళ నృత్యానికి నిదర్శనం ఈ ఫొటో. ముంబయి లోని కేఈఎమ్ ఆసుపత్రిలోని దృశ్యమట. ఆసుపత్రి కారిడార్లోని స్ట్రెచర్లపై ఉన్న శవాలంటూ మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణే తనయుడే ఈ నితేష్ రాణే.
అయితే నితేష్ చేసిన ఈ పోస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది పాత ఫొటో అని కొందరు, కాదు తాజా చిత్రమేనని మరికొందరు వాదిస్తున్నారు. కానీ రితేష్ ట్వీట్ చేసిన ఈ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారడం గమనార్హం. ఈ ఫొటోను చూసైనా కరోనా కట్టడికి మనం ఇంకాస్త జాగ్రత్తలు పాటిద్దామా మరి!