నడుమ దొర ఏందిరో, మధ్య రెడ్డి ఏందిరో, వాళ్ల పీకుడేందిరో, వీళ్ల జులుం ఏందిరో…!
ఏంటీ… పొద్దు పొద్దుగాల్నే గద్దరన్న పాట అందుకున్నరు అనుకుంటున్నరు కదా?
అనవసరంగా ఆ సిద్దిపేట కేసీఆర్ దొరవారు, ఈ మానుకోట రెడ్డి దొరలు శంకర్ నాయక్ ను ఎమ్మెల్యే చేశారు గానీ, వెలమ, రెడ్డి కులాలపై తనకు గల భావనకు ఈ పాటికి ఆయన శంకరన్నగా మారిపోయేవారేమో? అది కోపమో, ద్వేషమో…, కోపంతో కూడిన ద్వేషం వల్ల ఏర్పడిన ఏవగింపో తెలియదుగాని తాజాగా ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు విన్నాక మాత్రం ఇటువంటి రకరకాల సందేహాలు కలుగుతుంటాయి. శంకరన్నకు అవకాశం చిక్కితే ఈపాటికి ఏ దండకారణ్యంలోనో ఏకే-47 ధరించిన పే…ద్ద అన్నగా మారేవారేమో! ఎల్మోళ్ల సంగతి, రెడ్డోళ్ల సంగతి తేల్చేవారేమో?
కావాలంటే చూడండి తనకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి కారకులైన మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్రావువారి కులాన్ని, మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఓట్లను గుద్ది మారోసారి ఎమ్మెల్యేను చేసిన మానుకోట రెడ్డి దొరవారి కులాన్ని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎలా కీర్తిస్తున్నారో. కేవలం వెలమ, రెడ్లనే కాదండోయ్ కాస్త చదువుకుని విజ్ఞానాన్ని సముపార్జించుకున్న సరస్వతీ పుత్రులను సైతం శంకర్ నాయక్ తనదైన శైలిలో తూర్పారబడుతున్నారు. ఇంతకీ మన శంకరన్న ఏమన్నారనేగా మీ సందేహం. ఇదిగో ఇలా అన్నారు. ఆయన మాటల్లోనే చదవండి.
‘అబ్రహం లింకన్ తెలుసా? ఎవ్వరికన్న? అబ్రహం లింకన్ ఫాదర్ చెప్పులు కుట్టుకునేవాడు. అతను కష్టపడుకుంటూ లింకన్ ను చదివిచ్చాడు. ఆయన చదువుకుంటూ, చదువుకుంటూ కష్టపడి, కట్టెల్ మోపులమ్ముకుని, చెప్పులు కుట్టి, ఆయన అమెరికకు ప్రెసిడెంట్ అయితడు. ఓ సభ జరుగుతుంటుంది. ఆ సభలోఒక బలిసినవాడు ఏమంటడంటే? ఈ చెప్పులు కుట్టేవాడి కొడుకు అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. వీడికి ఇక్కడ పిలుస్తున్నరు. వాడి నానను కూడా పిలుస్తున్నరు…అని చెప్పేసి హేళన చేస్తడన్నట్టు…వాడు. అంటే మూడు బలుపులుంటయ్ ప్రపంచంలో. మూడు బల్పులుంటయ్ మనిషికి. ఏం బలుపయా అంటే? ఒకటి నేను రెడ్డి, నేను వెలమ అనే బలుపు ఒకటి. నేను బాగా డబ్బున్నది నా దగ్గర అనే బల్పు ఒకటి. నేను బాగా చదువుకున్న అనేది ఒకటి. మూడు బల్పులు ఉంటయ్ మనిషికి. ఈ బల్పులు ఉండొద్దు మనిషికి. ఎవ్వడికైనా కోస్తే ఎల్తది రక్తమే. అందరు తినేది అదే అన్నం. అదే నీరు, అదే గాలి. కాబట్టి అందరం కలిసి మెలిసి ఉండడం ముఖ్యం. ఒకరిని ఒకరు ప్రేమించడం ముఖ్యం. ఎవరికైతే ఆపద వస్తే దాన్ని ఆదుకోవడం ముఖ్యం. బైబిల్ తియ్యండి నేను చెప్త. ఏదో నేను ప్రవచనం మర్చిపొయిన.’’ అని ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రవచించారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగిన క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో శంకర్ నాయక్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యల ప్రసంగపు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా మహబూబాబాద్ జిల్లా తొలి కలెక్టర్ ప్రీతి మీనా ఘటనలో శంకర్ నాయక్ ఎదుర్కున్న వివాదాన్ని కూడా ఈ సందర్భంగా నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. తాజా వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో శంకర్ నాయక్ బీటెక్ చదివారని సైతం మానుకోట ప్రాంత వాసులు గుర్తు చేస్తుండడం గమనార్హం.