మానుకోటలో బాలుని కిడ్నాప్ విషాదాంత ఘటన…
ఎంత గొప్ప తెలివి గల నేరస్థుడైనా ఎక్కడో ఓచోట చట్టానికి చిక్కుతాడు. అందుకు సంబంధించిన ఆధారాలను తనకు తెలియకుండానే వదిలేస్తాడు. అనేక ఘోర నేర ఘటనల్లో రుజువైన అంశమిదే. పోలీసులకన్నా తామే తెలివైనవారమని ఎవరైనా క్రిమినల్స్ భావిస్తే అది పొరపాటే అవుతుంది కూడా. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన మహబూబాబాద్ ఘటనలో ప్రధాన నిందితుడు మంద సాగర్ పోలీసులకు చిక్కిన తీరు ఆద్యంతం ఆసక్తికరం. (సాగర్ ను ప్రధాన నిందితుడని ఎందుకు ప్రస్తావించాల్సి వస్తున్నదనే విషయాన్ని తదుపరి వార్తా కథనంలో ప్రత్యేకంగా చదవవచ్చు కూడా.) జర్నలిస్టు రంజిత్ రెడ్డి కుమారుడు దీక్షిత్ రెడ్డి (9)ని కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసిన ఘటనలో మంద సాగర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే మరో ముగ్గురు అనుమానిత వ్యక్తులు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక అసలు విషయంలోకి వెడితే బాలుడు దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసి అమానుషంగా హత్య చేసిన ఘటనలో మంద సాగర్ అనే యువకున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలున్ని కిడ్నాప్ చేసిందీ, అన్నారం దానమయ్య గుట్టవద్దకు తీసుకువెళ్లిందీ, గొంతు పిసికి హత్య చేసిందీ ఒక్కడేనని మానుకోట ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఈరోజు సాయంత్రంగాని, రేపు ఉదయం గాని వెల్లడిస్తామని ఎస్పీ కోటిరెడ్డి ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, కిరాతక హత్యోదంతంలో ప్రధాన నిందితుడు మంద సాగర్ నాలుగు రోజులపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టినట్లు తెలుస్తోంది.
అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం… మంద సాగర్ జర్నలిస్టు రంజిత్ రెడ్డి ట్రాక్టర్ డ్రైవర్ గానూ గతంలో పనిచేశాడు. అందువల్లే బాలున్ని కిడ్నాప్ చేయడంలో సాగర్ పెద్దగా రిస్క్ చేయాల్సిన అవసరం ఏర్పడలేదు. పరిచయం గల వ్యక్తే కావడంతో పిలవగానే బాలుడు దీక్షిత్ రెడ్డి సాగర్ బైక్ ఎక్కాడు. సీసీ కెమెరాలు లేని ప్రాంతంలో రెక్కీ నిర్వహించి మరీ సాగర్ బాలున్ని చాకచక్యంగా కేసముద్రం మండలం అన్నారం సమీపంలోని దానమయ్య గుట్టవద్దకు తీసుకువెళ్లాడు. పరిచయం ఉన్న వ్యక్తే కావడంతో బాలుడు దీక్షిత్ దీన్ని కిడ్నాప్ గా భావించలేదు. గుట్ట, అక్కడ గల చిట్టడవుల వాతావరణాన్ని బాలుడు కాసేపు కాలక్షేపంగానే భావించాడు. కానీ చీకటి పడుతుండడతో ఇంటికి వెడదామని సాగర్ పై దీక్షిత్ ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈ నేపథ్యంలోనే దీక్షిత్ అటూ, ఇటూ పరుగెత్తుతుండగా, సాగర్ బాలున్ని అదిమి పట్టుకోవడం, అటకాయించడం చేశాడు. తనను ఇంటికి తీసుకువెళ్లకపోతే విషయం అమ్మా, నాన్నలకు చెబుతానని దీక్షిత్ సాగర్ ను హెచ్చరించాడు. దీంతో దీక్షిత్ గొంతుపిసికి సాగర్ కిరాతకంగా ప్రాణం తీశాడు. ఆ తర్వాత ఘటనా స్థలం నుంచి బయటకు వచ్చి పెట్రోల్ తీసుకువెళ్లి బాలున్ని గుర్తు పట్టకుండా దహనం చేశాడు.
ఈ ఘోరపరిణామం అనంతరం కూడా సాగర్ డబ్బు కోసం రంజిత్ కుటుంబానికి ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. రూ. 45 లక్షల మొత్తాన్ని డిమాండ్ చేసిన సాగర్ కు అందుబాటులో గల కొంత మొత్తాన్ని ఇచ్చేందుకు రంజిత్ కుటుంబం కూడా సంసిద్ధమైంది. కిడ్నాప్, డబ్బు డిమాండ్ అంశాలను ప్రధాన నిందితుడు ‘ఇంటర్నెట్’ కాల్స్ ద్వారా చేశాడు. కిడ్నాప్ ఘటన క్లిష్టంగా మారడంతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే తమ కుమారున్ని రక్షించుకునేందుకు రంజిత్ రెడ్డి కుటుంబం డబ్బు ఇవ్వడానికి సిద్దపడింది. మానుకోటలోని ‘మూడు కొట్ల’ సెంటర్ కు రావలసిందిగా నిందితుడు ఫోన్ లో చెెప్పాడు. ‘వాయిస్ ఛేంజ్’ యాప్ ద్వారా తన గొంతు గుర్తు పట్టకుండా సాగర్ ఇంటర్నెట్ ద్వారా కాల్స్ చేశాడు.
డబ్బు గల బ్యాగును పట్టుకుని రంజిత్ రెడ్డి ‘మూడు కొట్ల’ సెంటర్ వద్ద కిడ్నాపర్ కోసం ఎదురు చూస్తున్నాడు. రంజిత్ డబ్బు సంచితో వేచి చూస్తున్న ప్రదేశం సాగర్ మెకానిక్ షాపునకు ఎదురుగానే ఉండడం గమనార్హం. రంజిత్ ను చూసిన సాగర్ ‘ఏందన్నా ఇక్కడ నిలబడి ఉన్నావ్?’ అని ప్రశ్నించాడు. ‘ఏమీ లేదు, నువ్వు నావద్దకు రావద్దు’ అంటూ రంజిత్ సాగర్ కు చెప్పాడు. అయితే అక్కడికి కిడ్నాపర్ రాలేదు. డబ్బును మూడు కొట్ల సెంటర్ నుంచి ఫాతిమా స్కూల్ వద్దకు తీసుకురావాలని మళ్లీ ఫోన్ చేశాడు. ఆ తర్వాత పూసపల్లికి తీసుకురావాలని కిడ్నాపర్ ఆదేశించాడు. ఇదే దశలో దాదాపు 100 మంది పోలీసులు మఫ్టీలో కిడ్నాపర్ కోసం వేచి ఉన్నారు. డబ్బు సంచి తీసుకునే వ్యక్తి కోసం కంటిమీద రెప్ప వాల్చకుండా మఫ్టీ పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఆసక్తికర అంశమేమిటంటే ఆయా పరిణామాలు చోటు చేసుకున్న సమయంలో కొందరు మఫ్టీ పోలీసులు సాగర్ మెకానిక్ షాపులోనే కూర్చుని వేచి చూస్తున్నారట. ఇదంతా ఉదయం 11 గంటల నుంచి రాత్రయ్యేవరకు సాగింది.
అయితే డబ్బుును ఎలా తీసుకోవాలో అర్థం కాక, మఫ్టీ పోలీసులను పసిగట్టిన సాగర్ తన మెకానిక్ షాపును మూసేసి బాలున్ని చంపిన దానమయ్య గుట్ట ప్రాంతంలోకే మళ్లీ వెళ్లాడు. మళ్లీ రంజిత్ కుటుంబానికి ఫోన్ చేశాడు. తాను అంతా చూస్తూనే ఉన్నానని, ప్రతి కదలికను డ్రోన్ కెమెరా ద్వారా వీక్షిస్తున్నానని సాగర్ రంజిత్ కుటుంబ సభ్యులతో చెప్పాడు. బ్యాగులో గల నోట్లు నకిలీవని వ్యాఖ్యానించాడు. తాను నకిలీ నోట్లు తీసుకురాలేదని, అసలు నోట్లేనని రంజిత్ స్పష్టం చేశాడు. కావాలంటే నోట్లను ధృవీకరించుకోవచ్చని రంజిత్ అభ్యర్థించాడు. ఇక్కడే కిడ్నాపర్ సాగర్ బొక్కబోర్లా పడ్డాడు. అప్పటి వరకు ఇంటర్నెట్ ద్వారా వాయిస్ ఛేంజ్ యాప్ లో గొంతు మార్చి మాట్లాడుతున్న సాగర్ బ్యాగులోని నగదు నోట్లను పరిశీలించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇంటర్నెట్ వాయిస్ కాల్ నుంచి ‘స్కైప్’ కాల్ చేసి బ్యాగులోని నోట్లను చూశాడు. తన ముఖం కనిపించకుండా సాగర్ జాగ్రత్త పడినప్పటికీ, అతను మాట్లాడిన ఫోన్ నెంబర్ డిస్ ప్లే అయ్యింది.
అప్పటికే కిడ్నాపర్ ఆచూకీ కోసం డేగకన్ను వేసిన సైబర్ క్రైం పోలీసులు అలర్టయ్యారు. నెంబర్ డిస్ ప్లే కాగానే కిడ్నాపర్ సాగర్ చిరునామా యావత్తూ వెల్లడైంది. దీంతో సాగర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కిడ్నాప్ చేసిన గంటలోనే బాలున్ని సాగర్ అమానుషంగా హత్య చేయడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
(మనోజ్ ఎవరు? అతని పాత్ర ఏమిటి?… తదుపరి కథనంలో…)