మహబూబాబాద్ పట్టణంలో కిడ్నాప్ నకు గురైన తొమ్మిదేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లా కేంద్రానికి చెందిన జర్నలిస్టు రంజిత్ రెడ్డి దంపతుల కుమారుడైన దీక్షిత్ రెడ్డి (9)ని గుర్తు తెలియని దుండగుడు గత ఆదివారం కిడ్నాప్ చేశాడు.
రూ. 45 లక్షల డబ్బు కోసం కిడ్నాపర్ డిమాండ్ చేశాడు. అయితే కొంత డబ్బును కిడ్నాపర్ కు ఇచ్చి తమ కుమారున్ని రక్షించుకోవడానికి రంజిత్ రెడ్డి దంపతులు చేసిన ప్రయత్నాలు సఫలం కాకముందే విషాదం చోటు చేసుకుంది. కేసముద్రం మండలం అన్నారం దానమయ్య గుట్టపై చిన్నారి దీక్షిత్ రెడ్డిని దుండగుడు గొంతు పిసికి కిరాతాకంగా చంపేశాడు.
బాలున్ని కిడ్నాప్ చేసిన గంట వ్యవధిలోనే దుండగుడు చంపేశాడని మహబూబాబాద్ ఎస్పీ ఎన్. కోటిరెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పారు. మహబూబాబాద్ లో మెకానిక్ గా పనిచేసే మంద సాగర్ అనే వ్యక్తి దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేశాడన్నారు. బాలుడి కిడ్నాప్ నకు ముందు అతను రెక్కీ నిర్వహించాడని, కిడ్నాప్ చేసిందీ, హత్య చేసిందీ మంద సాగర్ ఒక్కడేనని ఆయన చెప్పారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నామని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, మరిన్ని వివరాలు ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం వెల్లడిస్తామని ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు.