మహబూబాబాద్ లో విషాదాంతంగా ముగిసిన బాలుడి హత్యోదంతంలో కిడ్నాపర్ మంద సాగర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మానుకోట ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో వెల్లడించారు. తొందరగా డబ్బు సంపాదించాలనే ఆశతోనే కిడ్నాపర్ సాగర్ దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేశాడన్నారు.
మహబూబాబాద్ పట్టణానికి చెందిన రంజిత్ రెడ్డి టీ న్యూన్ ఛానల్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడని, అతని కుమారుడు దీక్షిత్ రెడ్డి ఇంటి ముందు ఆడుకుంటుండగా, ఈనెల 18వ తేదీన సాయంత్రం సుమారు ఆరు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడని చెప్పారు. ఘటనకు సంబంధించి బాలుని తల్లిదండ్రులు అదేరోజు ఫిర్యాదు చేశారన్నారు.
కేవలం త్వరగా డబ్బు సంపాదించాలనే దురుద్ధేశంతోనే ఇంటి ముందు ఆడుకుంటున్న దీక్షిత్ రెడ్డని శనిగపురం గ్రామానికి చెందిన మంద సాగర్ (23) అనే యువకుడు కిడ్నాప్ చేశాడన్నారు. సాగర్ మెకానిక్ గా పనిచేస్తున్నాడని, బాలున్ని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసేందుకు తాళ్లపూసలపల్లి పరిసరాల్లోకి తీసుకువెళ్లాడన్నాని ఎస్పీ వివరించారు.
అయితే తొరికిపోతాననే భయంతో కిడ్నాప్ చేసిన గంటలోపే బాలున్ని సాగర్ చంపేశాడన్నారు. ఈ కేసు విచారణలో అనేక మంది అనుమానితులను విచారించామన్నారు. పూర్తి స్థాయి టెక్నాలజీని ఉపయోగించి కేసును ఛేదించినట్లు ఎస్పీ కోటిరెడ్డి వివరించారు. ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.