కరోనా మహమ్మారి సబ్ డివిజనల్ స్థాయి పోలీసు అధికారిని బలి తీసుకుంది. మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్ముడ్ రిజర్వు (ఏఆర్) విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న పీఎస్ శశిధర్ కరోనా సోకి హైదరాబాద్ లోని నాంపల్లి కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు.
శశిధర్ మరణం పట్ల మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డితో పాటు జిల్లా పోలీస్ యంత్రాంగం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ. శశిధర్ మహబూబాబాద్ జిల్లాలో ఏడాదిన్నరపాటు సేవలు అందించారని చెప్పారు.
కాగా 1996 బ్యాచ్ ఆర్ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరిన శశిధర్ బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్ లో తొలుత విధులు నిర్వహించారు. తర్వాత ఆర్ఐగా పదోన్నతి పొంది కరీంనగర్, సిరిసిల్ల కేంద్రాల్లో పనిచేశారు. డీఎస్పీగా ప్రమోషన్ పొందిన శశిధర్ మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయానికి బదిలీపై వచ్చారు.
మహబూబాబాద్ ఏఆర్ డీఎస్పీ శశిధర్ మృతిపట్ల మంత్రి సత్యవతి రాథోడ్, మానుకోట ఎంపీ మాలోత్ కవిత సంతాపం తెలిపారు. శశిధర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.