సజ్జల రామకృష్ణారెడ్డి.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు షార్ట్ కట్ లో ‘సజ్జల’గా వ్యవహరించే నాయకుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా. ఈనాడు దినపత్రికలో ట్రెయినీ సబ్ ఎడిటర్ గా జర్నలిజంలో కెరీర్ ప్రారంభించిన సజ్జల ఉదయం పత్రికలో న్యూస్ ఎడిటర్ గా కూడా పనిచేశారు. ఆ పత్రిక మూతపడిన తర్వాత గ్రానైట్ వ్యాపారంలో తనదైన ముద్ర వేసిన సజ్జల సాక్షి పత్రికలో మూల స్థంభంగా నియమితులై, ఎడిటోరియల్ డైరెక్టర్ గా వ్యవహరించారు.
వైసీపీ పార్టీ స్థాపన తర్వాత ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాలుగా అండగా నిలబడ్డారు. ముఖ్యంగా పార్టీ వ్యవహారాల్లో సజ్జల పాత్ర చరిత్రాత్మకంగా వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారునిగా నియమితులయ్యారు. ఐదేళ్లపాటు అధికారంలో గల వైసీపీ హయాంలో సజ్జల సమాంతర అధికారాన్ని ఆస్వాదించారనే ప్రచారం ఉండనే ఉంది.
ముఖ్యంగా కేబినెట్ మంత్రులు సైతం సజ్జల అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాసిన సందర్భాలు ఉన్నాయని పార్టీ వర్గాలు గుసగుసలాడుకున్న ఘటనలు అనేకం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘డిఫాక్టో సీఎం’గా సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కేడర్ నోళ్లలో నానారు. అటువంటి అధికార వైభవాన్ని ఎంజాయ్ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డిని ఏపీలోని అధికార కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందా? అనే ప్రశ్న ప్రస్తుతం రేకెత్తుతోంది.
ఇందుకు బలం చేకూర్చే విధంగా తాజా ఘటన వెలుగులోకి రావడం గమనార్హం. ఇటీవలే విదేశాలకు వెళ్లి తిరిగి వస్తున్న సజ్జలను ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఈ ఘటన సోమవారం జరిగినప్పటికీ మరుసటి రోజుకుగానీ వెలుగులోకి రాలేదు. ప్రాచుర్యంలోకి వచ్చిన వార్తల ప్రకారం.. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని సజ్జల ఇమిగ్రేషన్ అధికారులను ప్రశ్నించారు. గుంటూరు పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారని పేర్కొంటూ, సజ్జలను ఇమిగ్రేషన్ అధికారులు పక్కన కూర్చోబెట్టారు.
దీంతో సజ్జల ఇమిగ్రేషన్ అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. తాను విదేశాలకు వెళ్లి వస్తున్నానని, తనపై ఎటువంటి కేసులు లేవని, పైగా హైకోర్టు నుంచి రక్షణ ఉందని, అయినా తనను నిలువరించడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని సజ్జల ఇమిగ్రేషన్ అధికారులతో వాదించినట్లు తెలుస్తోంది.
దీంతో ఇమిగ్రేషన్ అధికారులు గుంటూరు ఎస్పీకి సమాచారం చేరవేయగా, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం హైకోర్టు నుంచి రక్షణ పొందినమాట నిజమేనని, అతన్ని అదుపులోకి తీసుకోవద్దని ఆయన మెయిల్ ద్వారా జవాబు ఇవ్వగా, ఎట్టకేలకు సజ్జలను ఇమిగ్రేషన్ అధికారులు ముంబయి ఎయిర్ పోర్టు నుంచి బయటకు పంపారు.
ఇదే దశలో సజ్జలపై లుక్ అవుట్ నోటీసు జారీ అయినట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా ప్రకటించడం గమనార్హం. మరోవైపు పదిహేను రోజుల క్రితమే సజ్జలపై లుక్ అవుట్ నోటీసును దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులకు పంపి అలర్ట్ చేసినట్లు గుంటూరు పోలీసులు చెబుతున్నారు. సజ్జల దేశం విడిచి వెళ్లకుండా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంటున్నారు.
తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి నిందితుడని పోలీసులు చెబుతున్నారు. తాము లుక్ అవుట్ నోటీసు జారీ చేయడానికి ముందే సజ్జల విదేశాలకు వెళ్లారని వెల్లడిస్తున్నారు. అయితే హైకోర్టు రక్షణలో ఉన్నప్పటికీ, సజ్జలను విచారణకు పిలవవచ్చని, ఇందుకు సంబంధించిన కేసు సీఐడీకీ బదిలీ చేసిన నేపథ్యంలో ఆయా విభాగపు అధికారులే సజ్జలను విచారించే అవకాశమున్నట్లు భావిస్తున్నారు.
తాజా పరిణామాల్లో సజ్జలను విచారణకు పిలిచి ప్రశ్నించిన తర్వాత ఆయనను అరెస్టు చేసే అవకాశం లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికార హయాంలో ప్రభుత్వ విధానాలపైనేగాక, పార్టీ వ్యవహారాలపై సజ్జల అనర్గళంగా మాట్లాడేవారు. బేసిక్ గా జర్నలిస్టు కావడంతో సజ్జల విమర్శనాస్థ్రాలు పదునుగా ఉండేవి. దీంతో జగన్ సర్కారులోని మంత్రులకన్నా సజ్జలపైనే మీడియా ఫోకస్ ఉండేది. తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబునాయుడుపై విమర్శనాస్త్రాలు సంధించడంలో సజ్జల ప్రధాన పాత్ర పోషించేవారు.
వైసీపీ పార్టీ వ్యవహారాల్లోనేగాక, ప్రభుత్వ పాలనా అంశాల్లో తనదైన ముద్ర వేసిన సజ్జలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందనే ప్రచారం ఈ సందర్భంగా జరుగుతోంది. తాజా ఘటన నేపథ్యంలో సజ్జల అరెస్టు త్వరలోనే ఉండవచ్చని పరిశీలక వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా ముంబయి ఎయిర్ పోర్టులో సజ్జలకు ఎదురైన చేదు అనుభవపు ఘటన ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.