ఖమ్మంలో నూతనంగా నిర్మించిన బస్ స్టేషన్ కు సంబంధించిన ఓ ఘటనలో ఆర్టీసీ అధికారులను రాష్ట్ర లోకాయుక్త వివరణ కోరింది. ఖమ్మంలో కొత్తగా నిర్మించిన బస్ స్టేషన్ పరిశీలనకు వెళ్లిన సందర్భంగా తమపై టీఎస్ ఆర్టీసీ అధికారులు, పోలీసులు కుమ్ముక్కై అక్రమ కేసు నమోదు చేశారని, తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని అభ్యర్థిస్తూ సీపీఎం నేతలు వై. విక్రమ్, జె. వెంకన్నబాబు, నర్రా రమేష్ లు లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదులో ఆర్టీసీ ఖమ్మం బస్ స్టేషన్ మేనేజర్ జి. రఘుబాబును, కంట్రోలర్ ఎ.వి. రాములును, టూ టౌన్ సీఐ కరుణాకర్ ను నిందితులుగా ఉటంకిస్తూ లోకాయుక్తకు సీపీఎం నేతలు ఫిర్యాదు చేశారు. బాధ్యత గల పౌరులమైన తమకు ఈ కేసు వల్ల హక్కులకు, ప్రతిష్టకు భంగం కలిగిందని లోకాయుక్తకు నివేదించారు.

ఈ నేపథ్యంలో సీపీఎం నేతలు చేసిన ఫిర్యాదు కాపీని పంపిస్తూ వివరణ ఇవ్వాల్సిందిగా ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ కు లోకాయుక్త లేఖను పంపింది. సీపీఎం నేత విక్రమ్ చేసిన ఆరోపణలపై వచ్చే సెప్టెంబర్ 17వ తేదీన వివరణ ఇవ్వాలని లోకాయుక్త ఆదేశించింది. ఈ సందర్భంగా సీపీఎం నేత వై. విక్రమ్ ఓ ప్రతికా ప్రకటన విడుదల చేస్తూ, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఖమ్మం నగరంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించడంలో వెనుకాడేది లేదన్నారు. ఇప్పటికైనా రూ. 25 కోట్లతో నిర్మించిన కొత్త బస్ స్టేషన్ పనుల్లోని నాణ్యతపై తక్షణమే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నూతన బస్టాండ్ సంఘటనలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల రాజకీయ ఒత్తిడితోనే పోలీసులు, ఆర్టీసీ అధికారులు తమపై తప్పుడు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని ఆరోపించారు. ఇకనుంచి అక్రమ కేసులు పెడితే సీపీఎం పార్టీ సహించదని, అధికారులపై కూడా కోర్టు ద్వారా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఫొటో: ఖమ్మం బస్ స్టేషన్ ను సీపీఎం నేతలు విక్రమ్ తదితరులు పరిశీలించినప్పటి చిత్రం (ఫైల్)

Comments are closed.

Exit mobile version