పాకిస్థాన్ మిడతల దండు అనూహ్యంగా ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరిందా? ఓ ఇంటి ముందు గల జిల్లేడు చెట్టును ఆనవాళ్లు లేకుండా మిడతలు ఆరగిస్తున్న వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో తిరుగుతోంది. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని దాసప్ప రోడ్డులో గల ఓ ఇంటి ముందు చిత్రీకరించిన వీడియోగా ప్రచారం జరుగుతోంది. వీడియోలో వినిపిస్తున్న కొందరి సంభాషణ రాయలసీమ యాసలోనే ఉండడం గమనార్హం. దీంతో ఈ వీడియోకు బలం చేకూరుతోంది. అంతేగాక వీడియోలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫొటోతో కూడిన ఓ వాల్ పోస్టర్ కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వీడియో రాయదుర్గంలోనే చిత్రీకరించినట్లు విశ్వసించాల్సి వస్తోంది.
మహారాష్ట్ర వరకు వచ్చిన పాకిస్థాన్ మిడతల దండు ముందు తెలంగాణాలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే కర్నాటక సరిహద్ధుల్లో గల అనంతపురం జిల్లాలో మిడతలు కనిపించడం, జిల్లేడు చెట్టును తినేస్తున్న దృశ్యం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. పంట పొలాలకు అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్న ఈ మిడతలు విషపూరిత జిల్లేడు చెట్టును ఎలా భుజిస్తున్నాయో దిగువన గల వీడియోలో చూసేయండి.